calender_icon.png 2 August, 2025 | 5:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌పై ప్రచారం కల్పించాలి..

18-07-2025 12:00:00 AM

కరీంనగర్ నగరవాసులకు కూరగాయలు, మాంసం, పండ్లు, ఒకే చోట లభ్యమయ్యేందుకు ప్రభుత్వం నిర్మించిన సమీకృత మార్కెట్‌కు ఆదరణ కరువైంది. సర్కార్ మొదట నాలుగు ప్రధాన ప్రాంతాల్లో నిర్మించాలని తలపెట్టినప్పటికీ, ముందుగా పద్మానగర్‌లో మార్కెట్ నిర్మాణం పూర్తయింది. వ్యవసాయ మార్కెట్ ఆవరణలోని, కలెక్టర్ బంగ్లా ఎదుట చేపట్టిన మార్కెట్ నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదు.

కాశ్మీర్‌గడ్డ రైతు బజారును కూల్చివేసి నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ ఎప్పుడు పూర్తవుతుందో తెలియడం లేదు. నగరపాలక సంస్థ పదవీకాలం జనవరి 29న ముగిసింది. పద్మానగర్ మార్కెట్‌ను నగరపాలక సంస్థ పదవీ కాలం ముగిసేందుకు మూడు రోజుల ముందు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సమీకృత మార్కెట్ మాత్రమే నడుస్తున్నది. పద్మనగర్ ప్రాంత ప్రజలే కాకుండా పరిసర డివిజన్ల ప్రజలు, వ్యాపారులు, రైతులు ఈ మార్కెట్ వల్ల తమకు ప్రయోజనం చేకూరుతుందని ఆశించారు.

ప్రారంభోత్సవం తరువాత దాదాపు ఆరు నెలల వరకు మార్కెట్ వైపు అధికారులు, ప్రజాప్రతినిధులు కన్నెత్తి చూడలేదు. ఆ తరువాత మార్కెట్లోని దుకాణాలను అర్హులైన వారికి కేటాయించారు. నెల రోజుల క్రితం నుంచి మార్కెట్లోకి కొందరు వ్యాపారులు వచ్చి విక్రయాలు ప్రారంభించినప్పటికీ కొనుగోలుదారులు రాకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. ఇక్కడికి బదులు వీదుల్లోనే వ్యాపారం చేసుకుంటే మేలని వ్యాపారులు భావిస్తున్నారు.

రూ.10 కోట్లకు పైగా వెచ్చించి అత్యాధునిక హంగులతో నిర్మించిన ఈ సమీకృత మార్కెట్‌పై నగరపాలక సంస్థ ప్రజలకు అవగాహన కల్పించడం లేదు. పద్మనగర్ పరిసరాల ప్రాంతాల్లో ఉండే డివిజన్ల నాయకులు, మహిళా సంఘాలు, కాలనీ కమిటీల సమావేశాలను ఏర్పాటు చేసి సమీకృత మార్కెట్ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలని ప్రజలు కోరు తున్నారు.

సమీకృత మార్కెట్‌తోపాటు పరిసరాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, ముఖ్య కూడళ్లల్లో హోర్డింగ్ బోర్డులను ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉంటుందంటున్నారు. కాశ్మీర్‌గడ్డ, కలెక్టరేట్ బంగ్లా, వ్యవసాయ మార్కెట్‌లోని సమీకృత మార్కెట్లను పూర్తి చేసి వాటిని అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.

సమీకృత మార్కెట్లను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తే రోడ్లపై పార్కింగ్, ఇతర సమస్యలు తగ్గుతాయి. ఈ దిశగా కలెక్టర్, నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.

 కర్ణ, కరీంనగర్