7 June, 2026 | 2:53 AM

పక్షుల సంరక్షణపై అవగాహనకే బర్డ్ వాక్

07-06-2026 01:12 AM

అదనపు కలెక్టర్ నగేశ్

పోచారంలోని డీబీసీలో కార్యక్రమ నిర్వహణ 

మెదక్, జూన్ 6 (విజయక్రాంతి): ప్రకృతి పరిరక్షణ, పక్షుల సంరక్షణపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో బర్డ్ వాక్ కార్యక్రమం నిర్వహించినట్లు అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. శనివారం పోచారంలోని డీబీసీలో డీఎఫ్‌ఓ జోజి ఆధ్వర్యంలో అటవీశాఖ సిబ్బందితో చేపట్టిన బర్డ్ వాక్ కార్యక్రమాన్ని మెదక్ డీపీఆర్‌వో రామచంద్ర రాజుతో కలిసి అదనపు కలెక్టర్ నగేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్, డీఎఫ్‌ఓ జోజి పోచారంలోని డీబీసీలో నాలుగు కిలోమీటర్ల బర్డ్ వాక్‌లో పాల్గొన్నారు.

అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అటవీ వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించా మన్నారు. అందులో భాగంగా బర్డ్ వాక్ కార్యక్రమం నిర్వహించామన్నారు. పోచారం ల్యాండ్ స్కేప్ గొప్ప పక్షి వైవిధ్యం, సహజ వారసత్వం పట్ల ప్రశంసను ప్రోత్సహించడానికి బర్డ్ వాక్ నిర్వ హించామన్నారు. పోచారం జలాశయం, అభయారణ్యం చుట్టూ ఉన్న పోచారం ప్రాంతం, వలస నీటి పక్షులు, కొంగలు, ఐబిస్లు, బాతులు అనేక అటవీ ప్రాంతాలతో సహా విభిన్న పక్షి జీవనానికి ప్రసిద్ధి చెందిందన్నారు. ప్రకృతిని దగ్గరగా ఆస్వాదిస్తూ పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించుకోవడానికి బర్డ్ వాక్ వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్ ఆర్ ఓలు, బీట్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.