బూత్ స్థాయిలోనే కాంగ్రెస్ గెలుపునకు పునాది
పీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు
జనగామలో బూత్ స్థాయి సమావేశంలో పాల్గొన్న శ్రీనుబాబు తదితరులు
మంథని, జూన్ 6 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీని బూత్ స్థాయిలో బలోపేతం చేసేందుకు కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు పిలుపునిచ్చారు. శనివారం జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రంలోని సత్యసాయి ఫంక్షన్ హాల్‌లో స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్స్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
శ్రీనుబాబు మాట్లాడుతూ, పార్టీ విజయానికి బూత్ స్థాయి కార్యకర్తలే అత్యంత కీలకమని, వారి కృషి వల్లే పార్టీ పునాదులు పటిష్టమవుతాయన్నారు. ఓటరు జాబితాలో పేర్ల నమోదు, తొలగింపు, సవరణ ప్రక్రియలో బూత్ లెవెల్ ఏజెంట్లు అనుసరించాల్సిన మెళకువలను వివరించారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు ఎలా వ్యవహరించాలో దిశానిర్దేశం చేశారు. బూత్ స్థాయిలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు తీసుకోవాల్సిన చర్యలు, ప్రజా సమస్యలపై ఎలా స్పందించాలనే అంశాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో ప్రతి బూత్‌లో పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, బూత్ లెవెల్ ఏజెంట్లు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఈ శిక్షణ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.






