10 August, 2026 | 5:00 AM

‘తృణమూల్’ అధినేత్రి మమతకు చేదు అనుభవం

10-08-2026 12:41 AM

బిజ్‌పూర్‌లో కాన్వాయ్‌పై దాడి

కోడిగుడ్లు, చెప్పులు విసిరిన ఆందోళనకారులు

పోలీసులపై మమత ఆగ్రహం

కోల్‌కతా, ఆగస్టు 9: మృతి చెందిన టీఎంసీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతుండగా పశ్చిమ బంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ కారుపై రాళ్లదాడి జరగడం తీవ్ర కలకలం రేపింది. ఆదివారం మమత కారుపై ఉత్తర 24 పరగణాల జిల్లా బిజ్‌పూర్ సమీపంలో జరిగిన ఈ దాడితో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

అవినీతి ఆరోపణలపై పోలీసు కస్టడీలో అస్వస్థతకు గురై టీఎంసీ కార్యకర్త బిర్జు కియోత్ మృతి చెందాడు. దీనికి పోలీసులు గుండెపోటే కారణమణగా, కస్టడీలో హింసించి చంపారని టీఎంసీ ఆరోపించింది. ఈ మృతిపై అత్యున్నత న్యాయస్థానంతో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. హాలిషర్‌లో కియోత్ ఇంటికి మమత బెనర్జీ  వెళుతుండగా కారును చుట్టుముట్టిన నిరసనకారులు బురద, నీళ్ల సీసాలు, కోడిగుడ్లు, చెప్పులు విసిరారు. భారీ ఎత్తున ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

పోలీసులు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. మమత కాన్వాయ్‌ను ఆ ప్రాంతం నుంచి పంపించి వేశారు. సురక్షిత ప్రాంతానికి వచ్చిన మమత మీడియాతో మాట్లాడుతూ.. తన వాహనంపై రాళ్లు విసిరారని అద్దాలు తెరిచి ఉంటే తన తల పగిలేదని ఆరోపించారు. పోలీసుల కళ్లెదుటే అసాంఘిక శక్తులు విజృంభిస్తున్నా ఏమీ చేయలేని దుస్థితిలో వారున్నారని ఆరోపించారు. పోలీసులు బీజేపీ నిరసనకారులకు రక్షణ కల్పిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య ఈ దాడిని ఖండించారు.