కాంగ్రెస్ సర్కారుపై బీజేపీ చార్జిషీట్
హైదరాబాద్,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది వైఫల్యాలపై బీజేపీ ఛార్జిషీట్ ఆదివారం విడుదల చేసింది. కాంగ్రెస్ అలవికానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, కానీ గెలిపించిన ప్రజలు కూడా అప్పుడే ఆలోచనలో పడ్డారని ఆరోపించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని ఈ ఏడాదికాలంలో నెరవేర్చకుండానే ఈ ప్రభుత్వం విజయోత్సవాలు చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ విజయోత్సవాలను చూసిన ప్రజలు నివ్వెరపోతున్నారని ఆయన చమత్కరించారు.
ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. నియంతృత్వపాలన, కుటుంబపాలన, అవినీతి పాలన, నిరంకుశ, అవినీతి పాలనను సాగించిన బీఆర్ఎస్ ను పదేళ్ల తర్వాత ప్రజలు గద్దె దించారని కిషన్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ పాలనకు, కాంగ్రెస్ పాలనకు ఏమాత్రం తేడా లేదని, గతేడాది డిసెంబర్ 9వ తేదీన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది గడిచినా రుణమాఫీ పూర్తి చేయలేక పోయిందని కిషన్ రెడ్డి ఆరోపించారు.




