ఎన్‌కౌంటర్‌పై ములుగు ఎస్పీ వివరణ
మావోయిస్టలు జనజీవన స్రవంతిలో కలవాలి
హైదరాబాద్: ములుగు జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ పై ఎస్పీ శబరీశ్ వివరణ ఇచ్చారు. వాజేడులో ఇద్దరు అమాయకులను మావోయిస్టులు చంపారు. ఇలాంటి ఘటనలు జరగకుండా జిల్లాలో పెట్రోలింగ్ పెంచామని శబరీస్ స్పష్టం చేశారు. ఉదయం పెట్రోలింగ్ టీమ్ కు మావోయిస్టుల బృందం తారసపడింది. పోలీసులను చూసి మావోయిస్టులు కాల్పులు జరిపారు. లొంగిపోవాలని పలుసార్లు హెచ్చరించినా.. కాల్పులు ఆపలేదు.. ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని ములుగు ఎస్పీ స్పష్టం చేశారు. కాల్పులు తర్వాత ఏడుగురు చనిపోయినట్లు గుర్తించామన్నారు. మావోయిస్టులు జనసీవన స్రవంతిలో కలవాలని ఎస్పీ పిలుపునిచ్చారు.
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర సరిహద్దులోని చల్పాక అటవీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన కూంబింగ్ ఆపరేషన్ అనంతరం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం ములుగు జిల్లా ఏటూరునాగారం పోలీస్ స్టేషన్ పరిధిలోని చల్పాక అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఆయుధాల డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హతమైన మావోయిస్టులు నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) సభ్యులుగా గుర్తించారు. వీరిలో ఇల్లందు-నర్సంపేట ఏరియా కమాండర్ కుర్సం మంగు అలియాస్ భద్రు, ఏటూరునాగారం మహదేవ్‌పూర్ ఏరియా కార్యదర్శి డివిజనల్ కమిటీ సభ్యుడు (డివిసిఎం) పాపన్న ఏగోళపు మల్లయ్య అలియాస్ మధు ఉన్నారు. ఘటనా స్థలంలో వారి వద్ద ఉన్న ఏకే-47 రైఫిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఏరియా కమిటీ సభ్యులు, ముస్సాకి దేవల్ అలియాస్ కరుణాకర్, ముస్సాకి జమున, పార్టీ సభ్యులు జైసింగ్, కిషోర్, కామేష్ ఉన్నారు.




