8 April, 2026 | 11:25 PM

ఎనిమిది ఎఫెక్ట్.. కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ

01-12-2024 02:04 AM
  1. మొదట ఇచ్చేదే లేదన్న కేంద్రం
  2. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపుతో మంజూరు
  3. దశలవారీగా మరిన్ని కేంద్ర ప్రాజెక్టులు 
  4. తెలంగాణ ప్రజలను మచ్చిక చేసుకునేందుకు యత్నం

హైదరాబాద్, నవంబర్ 30 (విజయక్రాంతి): ‘కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఇచ్చేదే లేదు. అసలు దేశంలో కోచ్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసేదే లేదు. వ్యాగన్ ఫ్యాక్టరీ తప్ప కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చే ఉద్దేశమే లేదు’ అంటూ కేంద్రం పదే పదే చెప్పింది. 2022లో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సైతం ఈ విషయాన్ని రాజ్యసభ వేదికగా స్పష్టం చేశారు.

దేశంలో ఎక్కడా రైల్వే కోచ్ ఫ్యాక్టరీల అవసరం లేదని, ఇప్పటికే తగినన్ని కోచ్ ఫ్యాక్టరీలు ఉన్నాయని 2017లోనే చెప్పినా, వెంటనే లాతూరు(మహారాష్ట్ర)లో ఏర్పాటు చేశారు. ఈ అంశంపై ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినా కనీసం కేంద్రం స్పందించలేదు. ఆ తర్వాత 2022లోనే అస్సాంలోని కోక్రాజర్‌లోనూ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా తెలంగాణకు మొండిచేయే చూపించారు.

కానీ 2024 పార్లమెంట్ ఎన్నికలతో తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి పూర్తిగా మారిపోయింది. కోచ్ ఫ్యాక్టరీ అంశాన్ని అందరూ మర్చిపోయిన వేళ కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి గత నెల 24న ద.మ.రైల్వే పరిధిలోని ఎంపీలతో జరిగిన సమావేశం సందర్భంగా ఊహించని విధం గా కేంద్రం వైఖరిని వెల్లడించారు.

కాజిపేటకు కేంద్రం త్వరలో కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వబోతున్నదని తెలిపారు. ఇచ్చేదే లేదన్న దశ నుంచి ఇదిగో కోచ్ ఫ్యాక్టరీ తీసుకోండి అం టూ వరాలు కురిపించింది కేంద్రం. హఠాత్తుగా మనపై ఇంత ప్రేమ పుట్టుకు రావడా నికి కారణం తెలంగాణ ప్రజలు అందించిన 8 ఎంపీ సీట్లకు గిఫ్టుగా కోచ్ ఫ్యాక్టరీ మంజూరీ అని విశ్లేషకులు అంటున్నారు. 

8 ఎంపీలతో మారిన వైఖరి..

తెలంగాణలో బీజేపీకి ఓటర్లు ఉన్నా వాటిని తమకు అనుకూలంగా మార్చుకునే నేతలు లేరని బీజేపీకి పేరుంది. అలాంటి బీజేపీ ఊహించని విధంగా రాష్ట్రంలో అధికార పార్టీతో సమానంగా 8 ఎంపీ సీట్లు సాధించడం మామూలు విషయం కాదు.

అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 ఎమ్మెల్యే సీట్లతో పూర్తిగా వెనకబడిపోయినా... పార్లమెంటు ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో రాష్ట్రం ప్రాతినిథ్యాన్ని ఘనంగా చాటినందుకు తెలంగాణపై కేంద్రానికి ఊహించని విధంగా ప్రేమ పుట్టుకువచ్చింది.

మరికొంత గట్టిగా ప్రయత్నిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటి అధికారం కైవసం చేసుకునేందుకు అవకాశం ఉందని కేంద్ర నాయకత్వం భావిస్తోంది. తెలంగాణ ప్రజలను మచ్చిక చేసుకునేందుకు ఉన్న ఏ చిన్న అవకాశాన్ని సైతం కమలనాథులు వదులుకోవడం లేదని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.

అందుకే కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీతో పాటు పలు రైల్వే ప్రాజెక్టులను సైతం మంజూరు చేస్తున్నారు. భద్రాచలంమల్కన్‌గిరి రైల్వే మార్గం కూడా అలాంటిదే. దాంతో పాటు అనేక జాతీయ రహదారులకు సైతం కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకుపోతున్న పలు ప్రాజెక్టులకు త్వరగా మోక్షం లభిస్తోంది. మామునూరు ఎయిర్‌పోర్ట్ సైతం ఈ కోవకే వస్తుందని టీ బీజేపీ నేతలు చెబుతున్నారు. 

కోచ్ ఫ్యాక్టరీతో బీజేపీకి మైలేజీ..

దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ఆ ప్రాంతం నుంచి దేశ ప్రధాని అయిన పీవీ నర్సింహారావు హయాంలో కూడా సాధ్యం కాలేదు. కేంద్రంలో, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా కోచ్ ఫ్యాక్టరీ రాలేదు. ప్రత్యేకంగా ఎవరి ఒత్తిడి వల్ల ఈ ప్రాజెక్టు రాలేదని, చివరకు తెలంగాణ ప్రజలంతా కలిసి ఈ ఫ్యాక్టరీ సాధించారని భావించాలని బీజేపీకి చెందిన ఓ నేత తెలిపారు.

అయితే బీజేపీ కూడా ఈ ఫ్యాక్టరీని ఊరికే ఇచ్చిన పరిస్థితి అయితే లేదు. కాజీపేట రూపంలో తెలంగాణలో మైలేజీ పొందాలని ఆ పార్టీ యత్నంగా చెబుతున్నారు. రాబోయే ఎన్నికల నాటికి కోచ్ ఫ్యాక్టరీని పూర్తి చేసి వందేభారత్ రైళ్లకు కూడా ఇక్కడి నుంచి కోచ్‌లను తయారీ చేస్తూ ప్రత్యేకంగా ప్రచారం చేసుకునేలా వ్యూహం రూపొందించారని తెలుస్తోంది. 

తెరమీదకు రైల్వే డివిజన్ డిమాండ్

రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుతు న్న రైల్వే డివిజన్ డిమాండ్‌ను మరోసారి తెరపైకి తెస్తున్నారు. తెలంగాణ లో కేవలం రెండు రైల్వే డివిజన్లు (హైదరాబాద్, సికింద్రాబాద్) మాత్రమే ఉన్నాయి. అదే ఏపీలో గుంతకల్, గుంటూరు, విజయవాడ డివిజన్లున్నా యి. తెలంగాణలోనూ మరో రైల్వే డివిజన్‌ను కాజీపేటలో ఏర్పాటు చేయాల ని దశాబ్దాలుగా అడుగుతున్నారు.

డివిజన్ వల్ల ఈ ప్రాంతంలో అభివృద్ధికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. రైల్వే మౌలిక వసతులు పెరిగి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కాజీపేట నుంచే రైళ్ల రాకపోకలు ప్రారంభానికి అవకాశం ఉంటుంది. ఫలితంగా కనెక్టివిటీ మరింతగా అభివృద్ధి చెందుతుం ది.

అందుకే కాజీపేట రైల్వే డివిజ న్ ఏర్పాటు అనేది ఆ ప్రాంత ప్రజల చిరకాల డిమాండ్‌గా ఉంది. ఇప్పుడు తెలంగాణను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు డివిజన్ కూడా ఇస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఆ దిశగా రాష్ట్రానికి చెందిన ఎంపీలు పైరవీ చేస్తే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి.