బీజేపీ ఫ్లెక్సీలు చింపేస్తున్నారు
రేవంత్‌కు నోటీసులు ఇచ్చారన్న కక్షతోనే ఈ చర్యలు
కాంగ్రెస్‌పై డీజీపీకి ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకులు
హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి): మార్ఫింగ్ వీడియోల కేసులో సీఎం రేవంత్‌రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారనే అక్కసుతో బీజేపీ పోస్టర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగులను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చింపేస్తున్నారని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ ఎన్ రాంచందర్‌రావు ఆరోపించారు. ఎన్నికల సంఘం నుంచి అన్ని అనుమతులు తీసుకుని ఆర్టీసీ బస్టాండులు, బస్ షెల్టర్ల వద్ద వేసిన బ్యానర్లను చించివేసినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, నాయకులు అంథోని రెడ్డి, గోకుల్ రామా రావులతో కలిసి బుధవారం డీజీపీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బీజేపీ గుర్తు కనపడకుండా అనేక ఇతర పోస్టర్లు ఏర్పాటు చేసి తమకు ప్రచారం లేకుండా చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని, నిందితుల పేర్లు బయటకు రాకుండా ఇతరులపై నెట్టేస్తోందన్నారు.
బీజేపీ సభలకు జనం రాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసుల మద్దతును తీసుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ఓడిపోతున్నదనే భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని రాంచందర్‌రావు ఆరోపించారు. సిద్ధాంతాలపై పోరాడాలని కానీ మా పార్టీ ఫ్లెక్సీలను చింపడం, ప్రజల్లో తమకు ప్రచారం లేకుండా చేయడం అనైతిక చర్య అని విమర్శించారు. ఇది అప్రజాస్వామికమని, ఓడిపోతున్నామనే అసహనంతో చేస్తున్న చర్యగా ఆయన అభివర్ణించారు. వీవీ నగర్ రోడ్, దిల్‌సుఖ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన రెండు హోర్డింగ్‌ను కూల్చేశారని ఫొటోలతో సహా డీజీపీకి ఇచ్చిన ఫిర్యాదులో తెలిపామన్నారు. బీజేపీ ఎన్నికల ప్రచారానికి అడ్డుపడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా కేంద్ర హోం మంత్రి ప్రసంగాన్ని మార్ఫింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.




