సభ్యత్వ నమోదుపై బీజేపీ దృష్టి
- 21న సికింద్రాబాద్‌లో వర్క్ షాప్
- ఉనికిని చాటడం కోసం యత్నం
హైదరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): సభ్యత్వ నమోదుపై బీజేపీ దృష్టి సారించింది. పార్లమెంట్ ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాలు సాధించి సత్తా చాటిన కాషాయ పార్టీ పట్టణాలతో పాటు పల్లెల్లోనూ ఉనికి చాటాలని యత్నిస్తోంది. అందులో భాగంగా సభ్యత్వ నమోదుపై పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాజధాని నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేయనున్నారు. అందులో భాగంగా ప్రత్యేకంగా ఓ వర్క్ షాపును నిర్వహించాలని కూడా పార్టీ నిర్ణయించింది. పార్టీ సభ్యత్వ నమోదు మహోత్సవం పేరిట ఈనెల 21న సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్స్ రాష్ర్ట అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి అధ్యక్షతన వర్క్ షాప్ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, రాష్ట్ర పదాధికారులు, జిల్లాల అధ్యక్షులు పాల్గొంటారు. సభ్యత్వ నమోదు ద్వారానే పార్టీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోయేందుకు అవకాశం ఉంటుందని ఆ పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. అందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ అనేక వ్యూహాలతో ముందుకు సాగుతున్నదని, అందుకే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోబోమని పార్టీ నేతలు చెబుతున్నారు.
కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ బలోపేతం పట్ల పెద్దగా శ్రద్ధ చూపించడం లేదని, అందుకే సికింద్రాబాద్ వర్క్‌షాప్‌లో అన్ని అంశాలపై చర్చిస్తారని పార్టీకి చెందిన నేత ఒకరు తెలిపారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆశామాషీగా తీసుకుంటే చూస్తూ ఊరుకోబోమని, పార్టీని ముందుకు తీసుకుపోయేందుకు ప్రతి ఒక్కరూ సీరియస్‌గా ఉండాల్సిందేనని నేతలందరికీ సందే శం ఇచ్చేందుకు పార్టీ నాయకత్వం ఈ వర్క్ షాప్‌ను ఏర్పాటు చేసినట్లు సమాచారం.






