26 May, 2026 | 1:22 AM

ఫ్రెషర్స్ కావలెను!

20-08-2024 03:41 AM
  1. నైపుణ్యముంటేనే ఐటీలో ఉపాధి అవకాశాలు 
  2. ఖర్చు తగ్గించుకునే పనిలో కంపెనీలు

హైదరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): ప్రస్తుతం ఐటీ రంగం లో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా ఇప్పటికే చాలా కంపెనీలు లేఆఫ్స్ ప్రకటించాయి. వేలాది మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నాయి. అయితే సీనియర్, అనుభవం ఉన్న ఉద్యోగులను సైతం తొలగిస్తున్న కంపెనీలు ఫ్రెషర్స్‌ను నియమించుకోవాలని చూస్తున్నాయి. ప్రతిభ ఉన్న కొత్తవారిని ఆకర్షిం చేందుకు ఎక్కువ జీతాలివ్వడానికి కూడా కం పెనీలు వెనుకాడటం లేదని ఇటీవల ఫౌం డిట్ సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఉన్న ఐటీ కంపెనీలన్నీ నైపుణ్యమున్న కొత్తవారిని నియమించుకోవడంపై దృష్టి సారించినట్టు నివేదికలో తేలింది. 

ఫ్రెషర్లకు ‘ఐటీ’లోనే అత్యధిక ప్యాకేజీలు 

అన్ని రంగాలతో పోల్చుకుంటే ఫ్రెషర్ల వేతనాల చెల్లింపుల్లో ఐటీ రంగంలోనే ముందుంది. జీతాల వృద్ధి రేటులో ఐటీ, సర్వీస్ రంగాలు ముందు వరుసలో ఉంటే, ఆ తర్వాత రిటైల్, అడ్వర్టుజింగ్ రంగాలు ఉన్నాయి. అయితే ఐటీలో గణనీయమైన జీతాల వృద్ధి రేటు ఉన్నప్పటికీ ఆటోమోటివ్, ట్రావెల్ అండ్ టూరిజం వంటి రంగాల్లో మార్కెట్ సవాళ్ల కారణంగా ఈ వృద్ధి మందగిస్తున్నది.

రిటైల్ రంగంలో కొత్తవారికి సగటు కనీస సంవత్సర ప్యాకేజీ రూ.3.3 లక్షలుగా ఉంటే, గరిష్ఠ ప్యాకేజీ 5.21 లక్షలుగా ఉంది. జీతాల ప్యాకేజీల విషయంలో ఐటీ రంగంలో అద్భుతమైన ప్రగతి కొనసాగుతుంది. ఐటీ రంగంలో ఫ్రెషర్లకు గరిష్ఠంగా సంవత్సర ప్యాకేజీ రూ.4.1 లక్షల నుంచి రూ.7.5 లక్షల వరకు ఉంటుంది. ఈ సర్వే నివేదికను బట్టి ఐటీ రంగంలో ఫ్రెషర్లకు నియామకాలకు ఎంత అధిక డిమాండ్ ఉందో స్పష్టమవుతంది. 

11 శాతం పెరుగుదల 

ప్రతిభ గల కొత్తవారికి ఏటా డిమాండ్ పెరుగుతుండటంతో జీతాలు కూడా పెరుగుతున్నాయి. ఈ వృద్ధి రేటు ప్రధానంగా టెక్నాలజీ, డిజిటల్ మార్కెట్, ఈ రంగాల్లో ఎక్కువగా ఉన్నట్టు సర్వేలో తేలింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఐటీ రంగంలో ఫ్రెషర్లను నియామకం 11 శాతం పెరిగింది. ఇదిలా ఉండగా నియామకాల్లో వృద్ధి రేటులో రిటైల్, టెలికమ్యూకేషన్స్ రంగాలు ముందంజలో ఉన్నాయి. అన్ని రంగాల్లోకెల్లా రిటైల్ రంగం అత్యధికంగా 15 శాతం ఫ్రెషర్ల నియామక వృద్ధి రేటు సాధించింది. ఇది టెలికమ్యూకేషన్ రంగంలో 14 శాతంగా ఉందని నివేదికలో స్పష్టమైంది. వీటితోపాటు టెక్నాలజీ, ఏఐ అభివృద్ధి కారణంగా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ పరికరాలైన స్మార్ట్‌ఫోన్, టీవీ, స్మార్ట్‌వాచ్‌ల తయారీ రంగాల్లోనూ వంటి వాటిలో గణనీయమైన వృద్ధిరేటు ఉంది. 

అనుభవమెక్కువ.. వృద్ధిరేటు తక్కువ 

ఐటీ రంగంలో ఉద్యోగ నియామకాల్లో సీనియర్లు, అనుభవం ఉన్న వారి కంటే ఫ్రెషర్లకే ఎక్కువ డిమాండ్, ప్రాధాన్యం లభిస్తోంది. ఇది గతేడాదితో పోలిస్తే ఇప్పుడు పెరిగింది. ఐటీ సెక్టార్‌లో అసలు అనుభవం లేని ఫ్రెషర్ల నియామకాల వృద్ధి రేటు 11 శాతంగా ఉంటే, మూడేళ్లలోపు అనుభవం ఉన్న వారికి 13 శాతం వృద్ధి రేటు ఉంది. ఇదిలా ఉండగా పదిహేను ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఉద్యోగుల నియామకాల్లో మాత్రం ఈ స్థాయి వృద్ధి రేటు కన్పించడం లేదు. వీరి నియామకాల్లో కేవలం 6 శాతమే పెరుగుదల నమోదైందని సర్వేలో స్పష్టమైంది.

అయితే అనుభవం ఎక్కువ ఉన్నవారి నియామకాల్లో చెప్పుకోదగ్గ వృద్ధిరేటు లేకపోవడానికి కారణాలు న్నాయి. ప్రస్తుత సంక్షోభం కారణంగా జీతాల రూపంలో వెచ్చించే ఖర్చును కంపెనీలు తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఒక సీనియర్ ఉద్యోగికి ఇచ్చే జీతంతో కనీసం ఐదుగురు ఫ్రెషర్లకైనా జీతాలిచ్చే అవకాశం ఉంటుంది. అందుకే నైపుణ్యమున్న ఫ్రెషర్లను నియమించుకుని ఆశించిన స్థాయిలో ఐటీ ఉత్పత్తులు సాధించే దిశగా ఐటీ కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. 

ఏటా లక్ష మంది బీటెక్ విద్యార్థులు 

ఐటీ రంగంలో ఫ్రెషర్ల నియామకం వృద్ధిరేటు పెరగడం ఒకవిధం గా రాష్ట్రానికి కలిసొచ్చే అంశమే. ఎందుకంటే ఐటీ కంపెనీలన్ని ఫ్రెషర్లను నియమించుకునేం దుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఏటా ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసుకుని బయటకు వచ్చే వారికి ఇది ఒక అద్భుత అవకాశంగా మారుతుంది. తెలంగాణలో మొత్తం 176 ఇంజినీరింగ్ కాలేజీలున్నాయి. వాటి ల్లో ఏటా లక్ష మంది విద్యార్థులు బీటెక్ విద్యను పూర్తి చేసుకుంటున్నారు. అయితే నైపుణ్యం, ప్రతిభ ఉన్న ఫ్రెషర్లపైనే ఐటీ కంపెనీలన్ని దృష్టి సారించినందున ఇంజినీరింగ్ విద్యార్థులు కూడా ఆ దిశగా అడుగులు వేస్తే అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రస్తుతం మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా విద్యార్థులు ఆయా కోర్సుల్లో నైపు ణ్యం సాధించి అవకాశాలను అందిపుచ్చుకోవాలి.