26 May, 2026 | 3:04 AM

పరిశ్రమలతోనే ఉపాధి, సంపద

20-08-2024 01:05 AM
  1. మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ 
  2. ఏపీ సీఎం చంద్రబాబు

హైదరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి):  రాష్ట్రంలో పరిశ్రమలు  ఉపాధి, సంపద సృష్టిస్తాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం శ్రీసిటీ పారిశ్రామికవాడలోని పలు కంపెనీల సీఈవోలతో సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పరిశ్రమల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు పలు దేశాల్లో పర్యటించానని తెలిపారు. శ్రీసిటీలో 8వేల ఎకరాల్లో పారిశ్రామిక జోన్లు ఏర్పాటు చేయడంతో సెజ్, డొమెస్టిక్ జోన్, ఫ్రీట్రేడ్ జోన్‌లు వచ్చాయన్నారు. 220 కంపెనీల ఏర్పాటుకు ఇక్కడ అవకాశం ఉందని, ఒకేచోట 30 కంపెనీలతో సమావేశం నిర్వ హించినట్లు చెప్పారు. ఆటోమేటివ్, ఎలక్ట్రానిక్స్, ఎఫ్‌ఎంసీఈ పరిశ్రమలు వచ్చినట్లు తెలిపారు. 

ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడి నుంచి 4.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, 4 బిలియన్ డాలర్ల ఎగుమతులు సాధించడం చాలా గొప్ప విషయమన్నారు. చైన్నై, కృష్ణపట్నం, తిరుపతి ప్రాంతాలకు శ్రీసిటీ దగ్గరగా ఉందన్నారు. దీన్ని అత్యుత్తమ ఎకనమిక్ జోన్‌గా తయారు చేయాలనేది తన సంకల్పమన్నారు. శ్రీసిటీకి ఐజీబీసీ గోల్డెన్ రేటింగ్ గుర్తింపు వచ్చేలా కృషి చేస్తున్నట్లు,  పచ్చదనం కోసం వందశాతం నీటి సంరక్షణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.  అమరావతి నిర్మాణం చేపడుతున్నామని, రాజధాని కోసం 29వేల మంది రైతులు 34వేల ఎకరాలు ఇచ్చారన్నారు. ప్రస్తుతం ఇంటింటికి నీరు, విద్యుత్, ఫైబర్ నెట్ అందిస్తున్నామని వెల్లడించారు. 2029 నాటికి భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.