2 May, 2026 | 5:00 PM

కమలం పార్టీ ఆశలకు గండి

05-06-2024 12:05 AM

ఈసారి లోక్‌సభ ఎన్నికలు ఊహించని ఫలితాలను అందించాయి. ‘అబ్‌కీ బార్ చార్ సౌ పార్’ (ఈసారి 400 సీట్లకు పైగా) అన్న నినాదంతో  ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో బరిలో దిగిన ‘భారతీయ జనతా పార్టీ’ అధికారాన్ని అయితే నిలబెట్టుకోగలిగింది కానీ, ‘చావు తప్పి కన్ను లొట్టపోయిన చందం’గా  నాలుగు వందల స్థానాల మాట అటుంచి గతంలో సాధించిన 300పైగా స్థానాలను కూడా నిలబెట్టుకోలేక పోయింది. బీహార్, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో నితీశ్ కుమార్, చంద్రబాబు నాయుడు లాంటి నేతలపార్టీలతో పొత్తు పెట్టుకోక పోయి ఉంటే అధికారానికి సైతం దూరమై ఉండేదేమోనన్న పరిస్థితిలో నిలిచింది. దీంతో ఈసారి మోడీ నేతృత్వంలో ఏర్పడబోయేది ఎన్డీయే ప్రభుత్వమే తప్ప, బీజేపీ ప్రభుత్వం కాదనే విషయం స్పష్టంగా తేలిపోయింది.

మరోవైపు మిత్రపక్షాల మద్దతుతో తప్ప ప్రభు త్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో బీజేపీ లేకపోవడాన్ని సాకుగా తీసుకుని ఎన్డీఏ కూటమిలోని బలమైన ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం, జేడీ(యు) అధినేతలు చంద్రబాబు, నితీశ్ కుమార్‌లతో ఇండియా కూటమి నేతలు తెరవెనుక చర్చలు జరుపుతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే, ఆ వార్తల్లో నిజం లేదని ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్ ప్రకటించారు.

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే నాటికి కనీసం అభ్యర్థులను కూడా ఎంపిక చేసుకోలేని స్థితిలో ఉండిన కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలు ఊహించని రీతిలో గణనీయంగా పుంజుకుని అనూహ్య విజయాలు నమోదు చేశాయి. దేశ రాజకీయాలను శాసించే ప్రధాన రాష్ట్రాలైన యూపీ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లలో గణనీయంగా కమలం పార్టీ ఆశలకు గండి కొట్టి ఆధిక్యతను సాధించాయి. మధ్యప్రదేశ్, గుజరాత్, అసోం రాష్ట్రాల్లో క్లీన్‌స్వీప్, ఒడిశాలో నవీన్ పట్నాయక్ తిరుగులేని ఆధిక్యతకు గండి కొట్టి మెజారిటీ స్థానాలను దక్కించుకోకపోయి ఉంటే, మోడీ పరిస్థితి ఎలా ఉండేదో!

దక్షిణాది ఆశలు గల్లంతు

దక్షిణాదిలో పాగా వేయడానికి ప్రధాని మోడీ చేసిన ప్రయత్నాలు ఫలించి ఈసారి  రాష్ట్రాల్లో కమలం వికసిస్తుందన్న అంచనాలు తారుమారయ్యాయి. కేరళలో నటుడు సురేశ్ గోపీ విజయం సాధించడమొక్కటే ఆ పార్టీకి లభించిన ఊరట. తమిళనాడులో అన్నామలై లాంటి కరడు గట్టిన హిందుత్వవాది నాయకత్వంలో  పాదం మోపడానికి చేసిన ప్రయత్నాలూ ఫలించలేదు. కర్నాటకలోనూ మెజారిటీ స్థానాలను దక్కించుకోగలిగినప్పటికీ, గత ఎన్నికలతో పోలిస్తే సీట్లు తగ్గాయి.

మాజీ ప్రధాని నేతృత్వంలోని జేడీ(ఎస్)తో పెట్టుకున్న పొత్తు ఆ పార్టీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ వీడియోల బాగోతం పుణ్యమా అని బెడిసికొట్టింది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడితో చేతులు కలపడం వల్ల ఆ రాష్ట్రంలో మూడు సీట్లు గెలుచుకోగలి గింది. మరోవైపు బీజేపీతో పొత్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పార్టీలు ఘన విజయం సాధించడంతో మిత్రులకు లభించిన సీట్లుకూడా కమలం ఖాతాలో చేరడం కలిసివచ్చింది. అదే విధంగా, తెలంగాణలో సైతం ఆ పార్టీ బాగా పుంజుకుంది. గత ఎన్నికల్లో సాధించిన నాలుగు సీట్లకు రెట్టింపు సాధించింది.

యూపీలో ఎదురుదెబ్బ

దేశ రాజకీయాలను శాసించే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇక్కడి 80 లోక్‌సభ స్థానాల్లో ఎవరు మెజారిటీ స్థానాలు గెలుచుకుంటే వారిదే అధికారం. 2019 ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ 60కి పైగా స్థానాలను గెలుచుకొని తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించింది. తర్వాతి అయిదేళ్ల కాలంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో తన ప్రధాన అజెండా అయిన హిందుత్వ సిద్ధాంతం బలోపేతానికి ఎన్నో ప్రయోగాలు చేసింది. తద్వారా రాష్ట్రంలో బలమైన ప్రాంతీయ పార్టీలు సమాజ్ వాది పార్టీ(ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)లకు రాజకీయ ఉనికి లేకుండా చేసేందుకు గట్టి ప్రణాళికతో ముందుకు సాగింది.

అయోధ్యలో రామమందిర నిర్మాణ కార్యక్రమాన్ని లోక్‌సభ ఎన్నికలకు ముందు హడావుడిగా నిర్వహించింది. దీనికోసం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం కూడా నిర్వహించి, ‘బాలరాముడికి మందిరం నిర్మించాలన్న దేశ ప్రజల 500 ఏళ్ల నాటి కలను సాకారం చేసిన మోడీ’ అంటూ ప్రచారం సాగించారు. ఫలితంగా మరోసారి క్లీన్ స్వీప్ చేస్తామని ఆశించింది. అయితే, ఫలితాలు పూర్తి భిన్నంగా వచ్చాయి. కేవలం 38 స్థానాలను మాత్రమే దక్కించుకోగలిగింది.

రామమందిరం ఉన్న ఫైజాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో సైతం గెలవలేకపోయింది. కాంగ్రెస్ పార్టీతో పొత్తుతో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ మెజారిటీ స్థానాలను దక్కించుకుని బీజేపీ కోటకు బీటలు వారేలా చేశారు. అమేథీలో గత ఎన్నికల్లో రాహుల్ గాంధీపై విజయం సాధించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సైతం ఈసారి ఓడిపోయారు. 

మహారాష్ట్రలో కలిసిరాని పొత్తులు

యుపీ తర్వాత అత్యధిక పార్లమెంటు స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ, శివసేన, ఎన్‌సీపీ చీలిక వర్గాల కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఈ రాష్ట్రంపై బీజేపీ గంపెడన్ని ఆశలు పెట్టుకుంది. గతంలో శివసేన, బీజేపీల మధ్య దీర్ఘకాలం మైత్రీబంధం ఉండడంతో ఆ రాష్ట్రంలో ఈ కూటమిదే ఆధిపత్యం కొనసాగింది. తర్వాత జరిగిన పరిణామాల్లో శివసేన కూటమినుంచి బైటికి రావడం, శివసేన, శరద్‌పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ పార్టీలను నిలువునా చీల్చి ఆ వర్గాలతో చేతులు కలిపి కమలనాథులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగిపోయాయి.

అటు ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన, ఇటు పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ రెండూ కూడా రాజకీయ అస్తిత్వం కోసం పాకులాడే పరిస్థితి నెలకొంది. దీంతో ఈ రాష్ట్రంలో తమకు తిరుగుండదని బీజేపీ భావించింది. కానీ, అనూహ్యంగా ఈ రెండు పార్టీలు అధికార కూటమి అంచనాలను దెబ్బతీశాయి. కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసి రాష్ట్రంలోని మొత్తం స్థానాల్లో 27 సీట్లను దక్కించుకున్నాయి. ఎన్డీఏ కూటమి 20 సీట్లకే పరిమితమైంది. గత ఎన్నికల్లో బీజేపీ, అవిభక్త శివసేన కలిసి మొత్తం 41 స్థానాలను దక్కించుకున్నాయి. 

తిరుగులేని దీదీ

పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ఆధిపత్యాన్ని ఈసారి బీజేపీ దెబ్బతీస్తుందని  దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఎన్నికలకు ముందు పలువురు తృణమూల్ కాంగ్రెస్ నేతలపై ఈడీ, సీబీఐ కేసులు, మహువా మొయిత్రా, సందేశ్ ఖలి ఉదంతాలు ఇలా అనేక విధాలుగా మమతను ఉక్కిరి బిక్కిరి చేశాయి. అయినా, బెంగాల్ ప్రజలు దీదీపైనే విశ్వాసం ఉంచారు. రాష్ట్రంలోని మొత్తం 42 స్థానాలకుగాను తృణమూల్ కాంగ్రెస్ 31 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది.

గత ఎన్నికల్లో 18 సీట్లు గెలుచుకున్న కమలం పార్టీ ఈసారి 10 స్థానాలకే పరిమితమైంది.  ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన రాజస్థాన్‌లో కూడా అత్యధిక స్థానాలు దక్కించుకుంటామని భావించగా, కాంగ్రెస్‌తో హోరాహోరీ పోటీ జరిగింది. గత లోక్‌సభ ఎన్నికల్లో 25 స్థానాలకుగాను 24 సీట్లు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసిన పార్టీ ఈసారి 14 సీట్లకే పరిమితమైంది. పైన చెప్పినవన్నీ బీజేపీని దెబ్బతీసిన అంశాలు అయితే, అది కొత్తగా సాధించిన విజయాలే దాన్ని కాపాడాయని చెప్పాలి. 

ముఖ్యంగా ఒడిశాలో దాదాపు పాతికేళ్లుగా ఎదురు లేని నవీన్ పట్నాయక్ ఆధిపత్యానికి చరమగీతం పాడడం ఆ పార్టీ సాధించిన గొప్ప విజయం. ఇంత కాలంగా ఈ రెండు పార్టీల మధ్య స్నేహబంధం కొనసాగింది. నేరుగా పొత్తు లేకపోయినా అన్ని విషయాల్లో పట్నాయక్ కేంద్రానికి అండగా నిలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల నాటినుంచి రెండు పార్టీల మధ్య ఎడం పెరగడం, ఫలితంగా ఈసారి పొత్తు ప్రయత్నాలు ఫలించక విడివిడిగా పోటీ చేశారు. గత ఎన్నికల నుంచి రాష్ట్రంలో బలపడడానికి బీజేపీ అనేక ప్రయత్నాలు చేసింది.

దాని ఫలితమే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితికి చేరుకుంది. అలాగే, మొత్తం 21 లోక్‌సభ స్థానాలకుగాను 19 స్థానాలను గెలుచుకునే దిశగా సాగుతోంది. అటు మధ్యప్రదేశ్‌లోని మొత్తం 29 స్థానాల్లో క్లీన్ స్వీప్ చేయడం ద్వారా కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్ లాంటి కాంగ్రెస్ దిగ్గజనేతల ఆధిపత్యాన్ని దెబ్బ తీసింది. మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌తోపాటు ఢిల్లీ, అసోంలోనూ దాదాపుగా అన్ని స్థానాలను గెలుచుకుంది. చత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించడం కూడా ఆ పార్టీ మరోసారి కేంద్రంలో అధికారం దక్కించుకోవడానికి దోహదపడ్డాయని చెప్పాలి. ఫలితాల మాట ఎలా ఉన్నా ఈ ఎన్నికలు బీజేపీ, ప్రతిపక్షాలకు ఒక గుణపాఠాన్ని నేర్పాయి. 

 -కె రామకృష్ణ