2 May, 2026 | 6:20 PM

కాంగ్రెస్, బీజేపీ చెరిసగం

05-06-2024 12:05 AM

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో భిన్నమైన తీర్పునకు నాంది పలికాయి. రాష్టంలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో అధికార కాంగ్రెస్, బీజేపీలు చెరి 8 స్థానాలను గెలుచుకోగా, హైదరాబాద్ స్థానంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి ఘన విజయం సాధించారు. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో అధికారాన్ని కోల్పోయిన బీఆర్‌ఎస్ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లోను తీవ్ర నిరాశే మిగిలింది. అన్ని స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఒక్కచోట కూడా గెలవలేకపోయింది. ఇది రాబోయే రోజుల్లో ఆ పార్టీ ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తుందేమోనని రాజకీయ విశ్లేషకులు భయపడుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ముందే రాష్ట్రంలో రాజకీయ వేడి మొదలైంది.

అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండు పార్టీలూ ఫిరాయింపులకు తెరతీసి ప్రత్యర్థి పార్టీలు ముఖ్యంగా బీఆర్‌ఎస్‌లోని బలమైన నేతలను తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నించాయి. అంతేకాదు, పార్టీలోకి వచ్చిన వారికి టికెట్లు ఇచ్చి మరీ బరిలోకి దింపాయి. వరంగల్ జిల్లాలో బీఆర్‌ఎస్‌లో బలమైన నేత కడియం శ్రీహరిని పార్టీలోకి ఆహ్వానించి, ఆయన కుమార్తె కావ్యకు వరంగల్ స్థానాన్ని కాంగ్రెస్ కేటాయించింది. సికిందరాబాద్‌లో దానం నాగేందర్‌కు టికెట్ ఇచ్చింది.

బీజేపీ కూడా బీబీ పాటిల్ లాంటి వారిని చేర్చుకుని బరిలోకి దింపింది. ఫలితంగా ఒక దశలో బీఆర్‌ఎస్ నుంచి లోక్‌సభకు పోటీ చేయడానికి అభ్యర్థులు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. ఆ స్థితినుంచి బైట పడడానికి కేసీఆర్ చాలా శ్రమించల్సి వచ్చింది. పద్మారావు, కొప్పుల ఈశ్వర్ లాంటి నేతలను ఒప్పించి బరిలోకి దించాల్సి వచ్చింది. అయినా, ఫలితం లేకుండా పోయింది. బస్సు యాత్ర పేరిట రాష్ట్రమంతా విస్తృత ప్రచారం సాగించినా ఒక్క అభ్యర్థినీ గెలిపించుకోలేకపోయారు.  బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఏ నియోజకవర్గంలోనూ ప్రత్యర్థులకు గట్టి పోటీ సైతం ఇవ్వలేకపోయారు. 

ఇక, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్యనే ప్రధాన పోటీ అని ఆ రెండు పార్టీలు ్రప్రారంభం నుంచే చెబుతూ వచ్చాయి. అన్నట్లుగానే సీట్లను కూడా ఈ రెండు పార్టీలే పంచుకున్నాయి. రెండు పార్టీలు కూడా ఆధిక్యతను చాటుకోవడానికి సర్వ శక్తులూ ఒడ్డాయి. ప్రధాని నరేంద్ర మోడీ కూడా రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచార సభల్లో పాల్గొన్నారు. బీజేపీ తెలంగాణపై ఎంతగా దృష్టి పెట్టిందో ఆ పార్టీ చేసిన ప్రచారాన్నిబట్టే అర్థమవుతుంది. దీని ఫలితంగానే  అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయిన ఈటల రాజేందర్, రఘునందన్‌రావులు సైతం ఈసారి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీకూడా అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఆధిక్యతను నిలబెట్టుకోవడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించింది. 

బీజేపీకి దీటుగా ప్రచారం సాగించింది. నల్లగొండ నుంచి సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డికి సీటు ఇవ్వడంతోపాటు ఖమ్మంలో ఆర్థికంగా బలమైన నేత రఘురాం రెడ్డికి చివరి క్షణంలో టికెట్ ఇచ్చింది. మల్లు రవి లాంటి బలమైన నేతలను బరిలోకి దింపింది. అయితే, అయిదు నెలల క్రితం బీఆర్‌ఎస్ కంచుకోటను బద్దలు కొట్టిన ఆ పార్టీకి ఈ ఫలితాలు కాస్త నిరాశ కలిగించాయనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో బాగా లాభపడింది కమలం పార్టీయే.

గత ఎన్నికల్లో సాధించిన నాలుగు సీట్లకు తోడు మరో నాలుగు చేర్చుకుంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌కుతోడు ఈటల రాజేందర్,  కొండా విశ్వేశ్వర రెడ్డి, డీకే అరుణ లాంటి నేతలు పార్లమెంటులో అడుగు పెడుతున్నారు. ఇక, పాత బస్తీలో తమకు ఎదురు లేదని ఒవైసీ మరోసారి నిరూపించుకున్నారు. బీజేపీ అభ్యర్థి మాధవీలత ఉధృత స్థాయిలో ప్రచారం సాగించినా ఒవైసీ ఆధిక్యత ఏ మాత్రం తగ్గలేదు.  ఎన్నికల అనంతరం రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.