6 August, 2026 | 1:11 AM

ఎమ్మెల్యే ఆది వ్యాఖ్యలపై బీజేపీ రాద్ధాంతం

06-08-2026 12:13 AM

మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ ఆగ్రహం

వేములవాడ, ఆగస్టు 5 (విజయక్రాంతి): ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వ్యాఖ్యలను వక్రీకరిస్తూ బీజేపీ నాయకులు అనవసర రాజకీయ రాద్దాంతం సృష్టిస్తున్నారని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధానిపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి దురుద్దేశం లేదని, ‘మీ నాయకుడు.. మన దేశ ప్రధాని’ అనే ఉద్దేశంతోనే ఆ వ్యాఖ్యలు చేశారని స్పష్టం చేశారు.

విషయం పూర్తిగా తెలుసుకోకుండా విమర్శలకు దిగడం బీజేపీ నేతల అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. రాజకీయ విమర్శల కంటే ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని రాకేష్ పేర్కొన్నారు. రాజన్న ఆలయంతో పాటు వేములవాడ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకురావడంపై బీజేపీ నాయకులు దృష్టి పెట్టాలని సూచించారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్ తన పదవిని వినియోగించి రాజన్న ఆలయ అభివృద్ధికి అదనపు నిధులు సాధిస్తే ప్రజలు స్వాగతిస్తారని అన్నారు. విమర్శలు పక్కనపెట్టి, అభివృద్ధిలో భాగస్వాములు కావడం వల్లే ప్రజలకు అసలైన మేలు జరుగుతుందని హితవు పలికారు.