6 August, 2026 | 1:23 AM

హరితహారం చెట్ల నరికివేతపై ప్రత్యేక అధికారి ఆగ్రహం

06-08-2026 12:12 AM
  1. రైతులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశం
  2. నిర్లక్ష్యంపై ఆర్‌అండ్బీ అధికారులకు హెచ్చరిక

సిద్దిపేట రూరల్, ఆగస్టు 5 (విజయక్రాంతి) : చింతమడకసీతారాంపల్లి ప్రధాన రహదారి వెంట హరితహారం కింద నాటిన చెట్లను నరికివేస్తున్న ఘటనపై సిద్దిపేట రూరల్ మండల ప్రత్యేక అధికారి డా. ప్రియాంక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆమె, రహదారి అంచుల వరకు భూమిని చదును చేస్తూ చెట్లను తొలగిస్తున్న తీరును గమనించి ఆర్‌అండ్బీ అధికారులను అక్కడికక్కడే పిలిపించి వివరణ కోరారు. చెట్లను నరికివేస్తున్న రైతులకు వెంటనే నోటీసులు జారీ చేయాలని, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హరితహారం మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం వహించిన అధికారుల బాధ్యతపైనా నివేదిక సమర్పించాలని సూచించారు.

గ్రామపంచాయతీ పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, పంచాయతీ పాలకవర్గం ఆర్‌అండ్బీ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా సమయానికి చర్యలు తీసుకోకపోవడంతో చెట్ల నరికివేత కొనసాగుతోందని గ్రామస్థులు ప్రత్యేక అధికారికి వివరించారు. హరితహారం కింద నాటిన మొక్కలను కాపాడేందుకు తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని గ్రామపంచాయతీ కార్యదర్శి మల్లీశ్వరి, సర్పంచ్ చింతల రత్నాకర్ గౌడ్, ఉపసర్పంచ్ మిట్టపల్లి సుధాకర్, వార్డు సభ్యుడు గుర్రం రాజశేఖర్ రెడ్డి, ఫీల్ అసిస్టెంట్ కిష్టారెడ్డి, నాగరాజు, రెడ్డి శ్రీనివాస్,పడిగే యాదగిరి ఉన్నతాధికారులను కోరారు.