పాక్‌ను అడ్డం పెట్టుకొని బీజేపీ రాజకీయం
రాహుల్‌పై తప్పుడు విమర్శలు మానుకోవాలి..
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్..
హైదరాబాద్ (విజయక్రాంతి): పాకిస్థాన్ ఉగ్రవాదులు కశ్మీర్‌లోకి చొరవడి 26 మంది పర్యాటకుల ప్రాణాలు బలిగొనేవరకు కేంద్రంలోని బీజేపీ సర్కార్‌కు సోయిలేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(PCC Working President Jagga Reddy) మండిపడ్డారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్‌గాంధీ పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి ప్రజలకు సమాధానం చెప్పాలని కోరితే.. ఆయనపై నిందలు వేయడమేంటని ప్రశ్నించారు.
జగ్గారెడ్డి సోమవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. పాక్‌ను అడ్డం పెట్టుకొని బీజేపీ రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు. ట్రంప్ చెబితే పాకిస్థాన్‌తో మోదీ కాంప్రమైజ్ అయితే.. రాహుల్‌గాంధీపై కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు విమర్శలు చేయడమేంటని జగ్గారెడ్డి నిలదీశారు. తెలంగాణలోని బీజేపీ నేతలకు తలకాయలో బేజా లేదని ఎద్దేవా చేశారు. రాహుల్‌గాంధీపై చేస్తున్న తప్పుడు ప్రచారానికి బీజేపీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.






