4 June, 2026 | 6:35 PM

కూనంనేనికి బీజేపీ గురించి మాట్లాడే స్థాయి లేదు

04-06-2026 05:39 PM
  1. పొత్తు లేకుండా గెలిచే సత్తా కూనంనేనికి ఉందా ?
  2. మీడియా అటెన్షన్ కోసమే ప్రధానమంత్రి మోడీ పై విమర్శలు 
  3. కొత్తగూడెం సీటు కోసం పార్టీని తాకట్టు పెట్టిన మీరా బీజేపీని విమర్శించేది 
  4. దమ్ముంటే రాజీనామా చేసి పోటీకి రావాలని సవాల్ 
  5. ఉమ్మడి జిల్లా సంగతి కాదు కొత్తగూడెంలో గెలిచి చూపిస్తామంటూ ఓపెన్ ఛాలెంజ్ 
  6. కమ్యూనిస్టు రాష్ట్రాలు కనుమరుగై బిజెపి జెండాలు ఎగిరాయి 
  7. విలేకరుల సమావేశంలో బిజెపి అధ్యక్షులు "బైరెడ్డి"

కొత్తగూడెం జూన్ 4 విజయక్రాంతి: కమ్యూనిస్టులకు ప్రజలు రాజకీయ సన్యాసం ఎప్పుడో ఇచ్చారని ఇంకా కొత్తగా నువ్వు తీసుకునే సన్యాసం ఏమిటని బిజెపి జిల్లా అధ్యక్షుడు, బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గురువారం మండల కేంద్రమైన లక్ష్మీదేవిపల్లిలోని బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో,ఆయన మాట్లాడుతు కొత్తగూడెం ఎమ్మెల్యే, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అనుసరిస్తున్న విధానాలు మాట్లాడుతున్న విషయాలపై ఆయన మండిపడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఒక్క ఎమ్మెల్యే గెలిచిన తాను రాజకీయ సన్యాసం చేస్తానని ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేయడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కమ్యూనిస్టులకు రాజకీయ సన్యాసం ప్రజలు ఎప్పుడో ఇచ్చారని ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

రెండు సార్లు బూర్జువా పార్టీల అండతో ఎమ్మెల్యే అయిన సాంబశివరావుకు భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడే స్థాయి లేదని తీవ్రంగా విమర్శించారు. బిజెపిని సవాల్ చేసిన నాయకులు, పార్టీలు మట్టి కరిచిపోయాయని వ్యాఖ్యానించారు. అంతేగాక కమ్యూనిస్టుల ఆధీనంలో కొనసాగిన రాష్ట్రాలు కనుమరుగై బిజెపి కాషాయ జెండాలు రెపరెపలాడుతున్నాయి అన్నారు. మొదటిసారి కొత్తగూడెం నియోజకవర్గంలో మహా కూటమి మద్దతుతో కేవలం 1500 ఓట్ల మెజారిటీతో కూనంనేని గెలిచారని, అనంతరం 2014లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఐదో స్థానానికి పడిపోయారని అదే కమ్యూనిస్టులు బలమని ఎద్దేవా చేశారు. రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో, కమ్యూనిస్టు పార్టీ నైతికతను పక్కనపెట్టి ఓటుకు వెయ్యి నుంచి 1500 ఇచ్చి విజయం సాధించారని విమర్శించారు.

ఎమ్మెల్యే కూనంనేనికి ధైర్యం ఉంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి చేయాలని, అదే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు పోటీ చేస్తారని ఆయనపై గెలవగలరా అని ప్రశ్నించారు. జలగం వెంకట్రావు బిజెపి అభ్యర్థిగా ఓడిపోతే తాము రాజకీయ సన్యాసం చేస్తామని సవాల్ విసిరారు. కొత్తగూడెం కార్పొరేషన్ లో ఎన్నికల్లో కాంగ్రెస్ పై విమర్శలు చేస్తూ ప్రచారం చేసి మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మేయర్ పదవిని దక్కించుకున్న సిపిఐ పార్టీ నేతలు నియోజకవర్గంలో శాంతిభద్రత మంటగలుపుతున్నారని తీవ్రంగా విమర్శించారు.

మిషన్ భగీరథ పైప్ లైన్ కోసం గత ఎమ్మెల్యేల హయాంలో కోట్లాది రూపాయలు కేటాయించారని, తిరిగి భగీరథ పైప్లైన్ కోసం ప్రభుత్వం రోడ్లు తవ్వుతూ ఆగమాగం చేస్తున్నారని ఆరోపించారు. కొత్త లైన్ లంటూ కమిషన్ కోసమే పనులు చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. కార్పొరేటర్లకు ఎటువంటి గౌరవం లేదని, చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు సైతం ఎమ్మెల్యేనే చూసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ పట్టుమని పది ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేసే స్థాయిలేని కమ్యూనిస్టు పార్టీ బిజెపిని విమర్శించడమా అని ప్రశ్నించారు.

ఈ సమావేశంలో బిజెపి నాయకులు జిల్లా ఉపాధ్యక్షురాలు,చెరుకు భాగ్యలక్ష్మి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోడియం బాలరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జాటోత్ వెంకన్న నాయక్, పైడిపాటి రవీందర్, సముద్రాల గాయత్రి, పాల్వంచ టౌన్ అధ్యక్షులు రాపాక రమేష్, చుంచుపల్లి మండల అధ్యక్షులు బలగం శ్రీధర్, జిల్లా కార్యాలయ కార్యదర్శి దురిశెట్టి కుమార్, జిల్లా కార్యదర్శి తుంపూరి శివ గారు సీనియర్ నాయకులు గుములాపురం సత్యనారాయణ,  మీడియా కన్వీనర్ రామారావు జిల్లా నాయకులు, మండల స్థాయి నాయకులు, మహిళా నాయకురాళ్లు  తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.