బీజేపీని ఓడించాలి
సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ నేత పోటు రంగారావు
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూటమిని ఓడించాలని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ (ప్రజాపంథా) జాతీయ సహాయ కార్యదర్శి పోటు రంగారావు ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లౌకిక, ప్రజాస్వామ్య, వామపక్ష వాదులంతా ఐక్యమై ఫాసిస్టు విధానాలను అవలంబిస్తున్న బీజేపీ కూటమిని ఓడించాలని కోరారు. ఇండియా కూటమిలో భాగంగా సీపీఎం పోటీ చేస్తున్న అరకు, కర్నూలు, రంపచోడవరం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పోటీ చేస్తున్న పోలవరంలో ఆ పార్టీలకు తమ పార్టీ మద్దతిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ (ప్రజాపంథా) కేంద్ర కమిటీ సభ్యులు కేజీ రాంచందర్, కే రమ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కే సూర్యం, ఎస్‌ఎల్ పద్మ, ఎం హన్మేష్ తదితరులు పాల్గొన్నారు.




