హిందూ దేవాలయాలపై దాడులు - ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు
కీసర,(విజయక్రాంతి): రాష్ట్రంలో హిందూ దేవాలయాలు, ఉత్సవ విగ్రహాలపై దాడులు పెరిగిపోతున్నాయని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లి గ్రామంలో గురువారం రాత్రి రామాలయం వద్ద హనుమంతుని విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసిన ఘటన నేపథ్యంలో శుక్రవారం ఆలయం ముందు హిందూ సమాజం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో రామచంద్రరావు పాల్గొనారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో కావాలనే మత సామరస్యానికి విఘాతం కలిగించేలా దాడులు కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాదులో హిందూ దేవాలయాలు, ఉత్సవ మూర్తుల విగ్రహాలపై దాడులు పెరగడం ఆందోళనకరమని ఈ ఘటనలపై ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు.
24 గంటల్లో నిందితులను పట్టుకోవాలి: బీజేపీ హెచ్చరిక
హనుమంతుని విగ్రహ ధ్వంసం ఘటనకు పాల్పడిన నిందితులను 24 గంటల్లోగా పోలీసులు పట్టుకోవాలని రామచంద్రరావు హెచ్చరించారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని, విగ్రహ ధ్వంసానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్ చేశారు.




