23-10-2025 02:49:33 PM
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి తెలంగాణ రాష్ట్రంలో ఎంఐఎం మతోన్మాద మూకల స్వైర విహారం విపరీతంగా పెరిగిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు(Ramchander Rao arrested) ఆరోపించారు. ఎంఐఎం నాయకుల రాక్షసత్వానికి బీఆర్ఎస్ పార్టీ మౌనంగా ఉండి మద్దతు తెలుపుతుంటే, కాంగ్రెస్ పార్టీ వెన్నుతట్టి ప్రోత్సహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయక ప్రజలపై, అధికార యంత్రంగంపై, చివరికి రక్షణ కల్పించే పోలీసుల గుండెల్లో ఎంఐఎం గూండాలు కోరలు దింపుతున్నా చోద్యం చూస్తున్న చేవలేని కాంగ్రెస్ పార్టీ చేతకానితనాన్ని ఎండగడుతూ కాంగ్రెస్ -ఎంఐఎం రజాకార్ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ నిరసన చేపట్టినట్లు రామచందర్ రావు తెలిపారు.
గోరక్షకులపై తుపాకీలతో దాడిచేసిన వెంటనే అరెస్ట్ చేయాలని రామచందర్ డిమాండ్ చేశారు. పోలీసులపై దాడి చేసిన ఎంఐఎం కార్యకర్తలను అరెస్టు చేసే దమ్ములేని కాంగ్రెస్ ప్రభుత్వం, నిరసన చేపట్టిన తమను అక్రమంగా అరెస్టు చేసిందని మండిపడ్డారు. తెలంగాణలో అరాచక పాలనకు ఇదే నిదర్శనం అన్నారు. నిరసన తెలిపితే అరెస్టా? ఇదేనా ప్రజాస్వామ్యం? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఐఎం తొత్తుగా వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. గోభక్తులపై దాడులను సహించమన్న రామచందర్ తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.