21-02-2026 01:08:40 AM
జోష్‌ను కొనసాగించేలా బండి ప్రణాళిక
కరీంనగర్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని కరీంనగర్ కార్పొరేషన్ పై కాషాయం జెండా ఎగురవేసిన భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జడ్పీపై కూడా ఎగరవేయాలని చూస్తుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రణాళిక రచిస్తున్నారు.
కరీంనగర్ నగరపాలక సంస్థలో 30 డివిజన్లను కైవసం చేసుకొని అతిపెద్ద పార్టీగా అతరించడమే కాకుండా మరో ముగ్గురు స్వతంత్రుల మద్దతు, ఎక్స్ అఫీషియో సభ్యుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మద్దతుతో కాషాయ జెండా ఎగురవేసింది. రాష్ట్రంలోనే తొలిసారి జెండా పాతిన బీజేపీ కరీంనగర్ జడ్పీని కూడా కైవసం చేసుకునే ఆలోచనలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించడంతో ఈ దూకుడును అలాగే కొనసాగించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ చూస్తున్నారు.
బండి సంజయ్ కేంద్ర మంత్రి కాకముందు రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిన సమయంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సత్తాచాటారు. అప్పుడు ఎంఐఎం మద్దతుతో బీఆర్‌ఎస్ గద్దెనెక్కింది. తన స్వంత నియోజకవర్గమైన కరీంనగర్లో సత్తా చాటిన బండి జడ్పీ ఎన్నికల్లో కూడా జెండా ఎగురవేసి సత్తాచాటాలని చూస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో మొత్తం 15 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి.
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కరీంనగర్ రూరల్, కొత్తపల్లి జడ్పీటీసీ స్థానాలు ఉండగా, మానకొండూర్ నియోజకవర్గ పరిధిలో మానకొండూర్, తిమ్మాపూర్, శంకరపట్నం, హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట ఉన్నాయి. హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో చిగురుమామిడి, సైదాపూర్, చొప్పదండి నియోజకవర్గ పరిధిలో చొప్పదండి, గంగాధర, రామడుగు జడ్పీటీసీ స్థానాలున్నాయి. బండి సంజయ్ త్వరలో కరీంనగర్ కు వచ్చి కరీంనగర్ జడ్పీ పరిధిలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేయనున్నారు. కరీంనగర్ జడ్పీపై కాషాయ జెండా ఎగిరితే మరో సంచలనమవుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ వేవ్ కనిపించడంతో జడ్పీ ఎన్నికల్లో అది కొనసాగిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.