కేంద్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే!
ఎన్నికల ప్రచారంలో పార్టీ ఎంపీ అభ్యర్థి అర్వింద్
జగిత్యాల, మే 2 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా 400 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుని కేంద్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన కోరుట్ల నియోజకవర్గ పరిధిలోని అయిలాపూర్, మల్లాపూర్‌లో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్‌రెడ్డి ఎప్పుడు జైలుకు వెళ్తారా? అని మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎదురుచూస్తున్నారని ఆరోపించారు.
మతపర మైన రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు ప్రధాని మోదీ యత్నిస్తున్నారని కొనియాడారు. ఆయుష్మాన్ భారత్ పథ కంలో భాగంగా వైద్యసాయాన్ని రూ.5 లక్షలవరకు పెంచారన్నారు. కాంగ్రెస్ పార్టీ బలవంతంగా ఇతర పార్టీలకు చెందిన నాయకులను పార్టీలోకి చేర్చుకుంటుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్లిన విధంగానే, సీఎం రేవంత్‌రెడ్డి కూడా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ప్రచారంలో బీజేపీ నేతలు గోపిడీ శ్రీనివాస్, శివ, తుకారం, శరత్ పాల్గొన్నారు.




