26-11-2025 12:23:14 AM
కోల్‌కతా, నవంబర్ 25: ‘రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను గానీ, టీఎంసీనీ శ్రే ణులను గానీ టా ర్గెట్ చేస్తే బీజేపీ అంతుచూస్తా. నా అనుచరులు, పార్టీ శ్రేణులపై జరిగే దాడులను నాపై జరిగినట్లు భావిస్తా. బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం చేస్తా’ అని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హెచ్చరించారు. ఈసీ బెంగాల్ చేపడుతున్న ‘సర్’ ప్రక్రియపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మంగళవారం కోల్‌కతాలో నిర్వహించిన సభలో ఆమె బీజేపీపై నిప్పులు చెరిగారు.
‘సర్’ ప్రక్రియ బీజేపీ కనుసన్నల్లో జరుగుతున్నదని ఆరోపించారు. మున్ముందు ఎన్నికలు ఉన్నందువల్లే బీజేపీ మళ్లీ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) గురించి మాట్లాడుతోందని, మతపరమైన కార్డును వినియోగించుకుంటున్నదని మండిపడ్డారు. ధర్మం పేరుతో బీజేపీ అధర్మాన్ని ఆచరిస్తోందని దుయ్యబట్టారు. ఈ ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వ ఏజెన్సీలు, వనరులను వాడుకున్నా, బీజేపీ తనతో పోరాడి గెలవలేదని ఆమె ధీమా వ్యక్తం చేశారు.