హైదరాబాద్‌లో బీజేపీ x మజ్లిస్

01-05-2024 02:10:03 AM

దూకుడు పెంచిన పార్టీల అభ్యర్థులు 

గెలుపోటములపై జోరుగా చర్చలు 

సంధిమార్గంలో ఎంబీటీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అంతంతే

చాంద్రాయణగుట్ట, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెం ట్‌లో  కమలం, మజ్లిస్ మధ్య పోరు రసవత్తరంగా మారింది. నగరంలో పాగ వేసేం దుకు దశాబ్దాలుగా బీజేపీ ప్రయత్నిస్తున్నా మజ్లిస్ మాత్రం పాతుకుపోయింది. అయితే ఈ సారి ఎన్నికల్లో మార్పు కనిపిస్తోంది. కష్టపడితే తప్ప మజ్లిస్ సులభంగా గెలవలేదని పాతబస్తీలో టాక్ నడుస్తోంది. హైదరాబాద్‌పై కాషాయం జెండా ఎగరేసేందుకు బీజేపీ అభ్యర్థి మాధవీలత తీవ్రం గా కృషి చేస్తున్నారు. మజ్లిస్‌కు దీటుగా మాధవీలత ప్రచారం హోరేత్తిస్తున్నారు. మైనార్టీలు ఉన్న బస్తీల్లోనూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనికితోడు నగరంలో 5 లక్షల బోగస్ ఓట్లను తొలగించడ మూ ఎంఐఎంకు నష్టం కలిగించేదే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

దీంతో మజ్లిస్ కంచుకోటను స్త్రీ శక్తి బద్దలు కొట్టి చరిత్రను తిరగరాస్తుందా అనే చర్చ నడుస్తోంది. 1951 నుంచి మొదట్లో ఏడుసార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ తరువా త 1984లో మజ్లిస్ పార్టీ అధినేత స్వర్గీయ సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ విజయం సాధించారు. అప్పటి నుంచి వరుసగా 10 సార్లు లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకుని హైదరాబాద్‌ను కంచుకోటగా మార్చుకుంది.  గోషా మహల్ నియోజకవర్గం మినహా ఇస్తే మిగి తా ఆరు నియోజకవర్గాల్లో మజ్లిస్ పార్టీ నాయకులే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఈ ఆరు నియోజకవర్గాలలో మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉండటంతో ఒవైసీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

ఎంబీటీతో సంధి..!

పాతబస్తీలో ఎన్నో ఏళ్లుగా మజ్లిస్, ఎంబీ టీ పార్టీల మధ్య అధిపత్య పోరు కొనసాగుతుంది. అయితే ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో ఎంబీటీ పోటీ నుంచి తప్పకున్నట్లు ప్రకటించడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. ఈ నిర్ణయం మజ్లిస్ పార్టీ గెలుపునకు సహకరించినట్లు అవుతుందనే వాదన రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. ఎంబీటీ పార్టీ అధ్యక్షుడు ఫర్హాత్‌ఖాన్ మతతత్వ శక్తులను ఓడించేందుకే పోటీ నుంచి తప్పుకున్నట్లు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఎంబీటీకి పోలై య్యే ఓట్ల కారణంగా బీజేపీ లాభపడే అవకాశం ఉండటతో పోటీ చేయడం లేదనే వాదన వినిపిస్తోంది. మైనార్టీల ఓట్లు గంపగుత్తగా పతంగికి పడే అవకాశాలు ఉన్నాయి. మరో పక్క కాంగ్రెస్ అభ్యర్థి వలీఉల్లా సమీ ర్, బీఆర్‌ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాద వ్ ప్రభావం ఎన్నికల్లో అంతగా లేకపోవడం కూడా మజ్లిస్ పార్టీకి కలిసివచ్చే అంశంగా పార్టీలో చర్చ జరుగుతోంది. దీనికితోడు ఏనాడు లేని విధంగా మజ్లిస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి.. నాయకుడి వీరత్వంపై నల్గొండ గద్దర్‌తో తెలుగులో పాట పాడించడం మజ్లిస్‌లో వచ్చిన మార్పుగా ప్రజలు చర్చించు కుంటున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ, మజ్లిస్ మధ్యనే కొనసాగుతుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

మాధవీలతపై చర్చ.. 

బీజేపీ అభ్యర్థి మాధవీలతకు ప్రజ ల్లో రోజురోజుకూ అదరణ పెరుగుతోంది. ఆమెకు సమాజ సేవకురాలు గా, భరతనాట్య కళాకరిణిగా గుర్తింపు ఉంది. సంతోష్‌నగర్‌లో 1988లో అక్టోబర్ 2న జన్మించారు. ఉస్మాని యా విశ్వవిద్యాలయంలో ఎంఏ చేశా రు. అనంతరం ఫ్యాషన్ డిజైనింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. విరించి వైద్యశాల వ్యవస్థాపకుడు విశ్వనాథ్‌ను పెండ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు, ఓ కొడుకు ఉన్నారు. ఏడాదిగా ప్రజల్లో మమేకమై అధ్యాత్మిక ప్రసంగాలు చేస్తూ వస్తున్నారు. బీజేపీ పార్టీ హైదరాబాద్ లోక్‌సభ సీటును ఆమెకు కేటాయించడంతో మాధవీలత పేరు ప్రజల్లో మారుమోగు తుంది. విభిన్న శైలితో ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్‌లో గెలిచి కొత్త చరిత్రకు పునాది వేస్తారో లేదో చూద్దామని ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.