25 May, 2026 | 10:23 AM

గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు

18-04-2024 03:02 AM

l డబుల్ డిజిట్‌పై దృష్టి సారించిన కమలనాథులు

l కాషాయ పార్టీలో కొత్త ఉత్సాహం

l అందరి కంటే ముందే అభ్యర్థుల ప్రకటన

l మోదీ ఛరిష్మా కలిసి వస్తుందనే నమ్మకం 

l బీఆర్‌ఎస్ స్పేస్‌ను అనుకూలంగా మార్చుకునే యత్నం

హైదరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): తెలంగాణలోని భారతీయ జనతా పార్టీలో ఎప్పుడూ లేనంతగా ఉత్సాహం కనిపిస్తోంది. రాష్ట్రంలో మెజారిటీ సీట్లు సాధించడమే లక్ష్యంగా ఆ పార్టీ పావులు కదుపుతోంది. గత పార్లమెంటు ఎన్నికల్లో 4 సీట్లు కైవసం చేసుకుని సత్తా చాటిన బీజేపీ ఈసారి డబుల్ డిజిట్ దాటాలని టార్గెట్ పెట్టుకుంది. అందులో భాగంగానే రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే ముందుగానే తమ అభ్యర్థులను ప్రకటించింది. అంతేకాకుండా రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ అధికారం కోల్పోవడమూ బీజేపీకి కలిసి వచ్చేలా కనిపిస్తోంది.

బీఆర్‌ఎస్ స్పేస్‌ను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కమలనాథులు ప్రయత్నిస్తున్నారు. ప్రధాని మోదీ ఛరిష్మాను సద్వినియోగం చేసుకుని పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలనే ఆ పార్టీ ఎత్తుగడగా తెలుస్తోంది. హైదరాబాద్‌లోనూ ఎంఐఎంతో బీజేపీ పోటాపోటీగా ముందుకు సాగుతున్నది. అయోధ్య రామ మందిర నిర్మాణమూ బీజేపీకి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. అంతేకాకుండా ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతుండటం అత్యంత సానుకూలాంశంగా కనిపిస్తోందని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు.  

ముందే అభ్యర్థుల ప్రకటన...

అనవసర గందరగోళం లేకుండా అభ్యర్థుల ప్రకటించి, వారు ప్రచారం చేసుకునేందుకు తగినంత సమయం లభించేలా ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. మిగితా పార్టీలకంటే ముందే అభ్యర్థుల ఎంపికపై కసరత్తును పూర్తి చేసింది. ఎన్నికల షెడ్యూల్ రాకముందే రెండు జాబితాలను సైతం విడుదల చేసింది. మార్చి 2వ తేదీన 9 మంది అభ్యర్థులతో మొదటి జాబితా ప్రకటించగా... అందులో కిషన్ రెడ్డి (సికింద్రాబాద్), బండి సంజయ్ (కరీంనగర్), ధర్మపురి అరవింద్ (నిజామాబాద్), ఈటల రాజేందర్ (మల్కాజిగిరి), పోతుగంటి భరత్ (నాగర్ కర్నూలు), బూర నర్సయ్య గౌడ్ (భువనగిరి), కొండా విశ్వేశ్వర్ రెడ్డి (చేవెళ్ల), బీబీ పాటిల్ (జహీరాబాద్), మాధవీలత (హైదరాబాద్) అభ్యర్థిత్వాలకు అధిష్టానం ఓకే చెప్పింది.

ఇక మార్చి 13వ తేదీన ఆరుగురు అభ్యర్థులతో రెండో జాబితా విడదల చేయగా... డీకే అరుణ (మహబూబ్ నగర్), రఘునందన్ రావు (మెదక్), గోడం నగేశ్ (ఆదిలాబాద్), సీతారాంనాయక్ (మహబూబాబాద్), సైదిరెడ్డి (నల్గొండ), గోమాస శ్రీనివాస్ (పెద్దపల్లి) పేర్లను ప్రకటించింది. మార్చి 25న మూడో జాబితాలో ఆరూరి రమేశ్ (వరంగల్), తాండ్ర వినోద్ రావు (ఖమ్మం)కు అవకాశం ఇచ్చింది. అభ్యర్థుల పేర్లు ప్రకటించిన వెంటనే వారంతా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అప్పటికే పక్కాగా టికెట్  వస్తుందని భావించిన ముఖ్య నేతలు ప్రజల మధ్యనే ఉంటూ పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమయ్యారు. 

బీజేపీలో చేరిన వెంటనే 

ఎంపీ టిక్కెట్లు...

తెలంగాణలో ఉన్న 17 ఎంపీ స్థానాల్లో 9 చోట్ల బీజేపీ కొత్త ముఖాలకు అవకాశం కల్పించింది. ఆర్‌ఎస్‌ఎస్ బ్యాక్ గ్రౌండ్ లేని వారు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే వీరంతా. పార్టీలో అప్పటికే ఆశావహులు ఉన్నా వారిని కాదని గెలుపు అవకాశాలు ఉన్న వారికే టికెట్లు ఇచ్చినట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన గోడం నగేశ్, జి. శ్రీనివాస్, బీబీ పాటిల్, తాండ్ర వినోద్ రావు, ఆరూరి రమేశ్, సైదిరెడ్డి, పోతుగంటి భరత్, సీతారాం నాయక్, మాధవీలత నేరుగా బీజేపీ టిక్కెట్లు సాధించి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కొత్తవారే అయినప్పటికీ క్షేత్ర స్థాయిలో వారికి ఉన్న పలుకుబడి, గెలుపు అవకాశాలను అంచనా వేసిన తర్వాతే బీజేపీ వీరికి టిక్కెట్లు కేటాయించింది. 

బీఆర్‌ఎస్ అనూహ్య ఓటమి..

పదేళ్లు తిరుగులేని శక్తిగా తెలంగాణను పాలించిన బీఆర్‌ఎస్ పార్టీ నేడు ప్రతిపక్షంగా మారిపోయింది. ఈ ఎన్నికల వేళ ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో చేరిపోతున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే తేడా లేకుండా అందరూ పార్టీని వీడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ బలహీనపడటం బీజేపీకి వరంగా మారుతోంది. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన కాంగ్రెస్ వ్యతిరేక ఓటు తప్పనిసరిగా బీజేపీకి అనుకూలంగా మారే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీకి 37 శాతం ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 39 శాతం ఓట్లు, బీజేపీ 14 శాతం ఓట్లు సాధించాయి.

గత పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 3 సీట్లు మాత్రమే సాధించిన కాంగ్రెస్ ఈసారి అధికారంలో ఉండటంతో అందరికంటే ఎక్కువ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ హవా, పదేళ్లుగా అవినీతి రహితంగా పరిపాలన అందిస్తున్నామని చెబుతున్న బీజేపీ ఈసారి కచ్చితంగా తెలంగాణలో అందరికంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని ధీమాగా ఉంది. ఊహించని విధంగా హైదరాబాద్ సహా రాష్ట్రంలో మెజారిటీ సీట్లు తామే కైవసం చేసుకుంటామని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.