లోక కల్యాణం సీతారాముల పరిణయం

18-04-2024 03:00:30 AM

భద్రాచలంలో నేత్రపర్వంగా కల్యాణ మహోత్సవం

ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన సీఎస్ శాంతికుమారి

నేడు రామయ్యకు మహాపట్టాభిషేకం

భద్రాచలం, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): మంగళ వాద్యాల ప్రతిధ్వనులు.. వేద పండితుల పెండ్లి మంత్రాలు.. ‘శ్రీరామా.. జయ రామా.. జయ జయ రామా ..’ అన్న భక్తుల నామస్మరణ నడుమ ఎప్పుడెప్పుడా.. అని ఎదరు చూస్తున్న క్షణాలు రానే వచ్చాయి. బుధవారం మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు అభిజిత్ ఘడియల్లో అర్చకులు సీతారాములపై జీలకర్ర, బెల్లం ఉంచారు. దశరథ మహారాజు, జనక మహారాజు, భక్త రామదాసు చేయించిన మూడు తాళిబొట్లు చూపిస్తూ సీతమ్మకు మంగళ సూత్రాలధారణ చేశారు. ఈ అపురూపమైన వేడుకకు భద్రగిరిలోని మిథిలా ప్రాంగణం వేదికైంది. కల్యాణ మహోత్సవాన్ని చూసి భక్తకోటి తరించింది. పవిత్ర గోదావరి తీరం పులకించింది. ఆలయ అధికారులు, అర్చకులు ఉదయం 10 గంటలకు ప్రధాన ఆలయం నుంచి మేళతాళాల నడుమ కల్యాణమూర్తులను సీతారామచంద్రస్వామి ఆలయ సన్నిధిలోని మిథిలా ప్రాంగణంలోని మండపంలోకి తీసుకువచ్చారు. రామయ్యకు అభిముఖంగా సీతమ్మను పెళ్లి పీటలపై ఆశీనులను గావించారు. వేదపండితులు విశ్వక్సేన పూజ, ప్రవరణ, మోక్షబంధనం, యజ్ఞోపవీతం, వర పూజ నిర్వహించారు. మధుపర్కాలు సమర్పించారు. వాగ్గేయకారుడు భక్తరామదాసు చేయించిన పచ్చల పతకాన్ని రామయ్యకు, చింతాకు పతకాన్ని సీతమ్మకు, శ్రీరామ మాడను లక్ష్మణుడికి అలంకరించారు. సీతమ్మకు మాంగళ్యధారణ తర్వాత వధూవరులకు ఆండాళమ్మ, శ్రీరంగనాథుని ప్రబోధంతో వైష్ణవ సంప్రదాయం ప్రకారం బంతులాట సంబురం నిర్వహించారు. ముత్యాల తలంబ్రాల పోత తర్వాత సీతారాములకు అష్టోత్తర హారతి ఇచ్చి కల్యాణ వేడుకను ముగించారు. ఆలయ ఆస్థానాచార్యులు శ్రీమాన్ స్థల సాయి కల్యాణ ప్రాశస్త్యాన్ని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాధురి దంపతులు పట్టువస్త్రాలను బహూకరించారు. వేడుకలోని వీఐపీ గ్యాలరీలో కూర్చొని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ కల్యాణ మహోత్సవాన్ని వీక్షించారు.

మూడు మంగళసూత్రాలెందుకు.. ?

సీతమ్మకు మూడు మంగళ సూత్రాలధారణ చేయడమేంటి? అనుకుంటున్నారా.. దాని వెనుక ఓ కారణం ఉంది. సాధారణంగా వైదిక సంప్రదాయం ప్రకారం రెండు మంగళసూత్రాలే ఉంటాయి. వాటిలో ఒక మంగళసూత్రం పుట్టినింటిది కాగా, మరో మంగళసూత్రం మెట్టినింటిది. ఇక మూడో మంగళసూత్రం భక్తరామదాసు చేయించినది.  భద్రాచలంలో సీతారామచంద్రస్వామి ఆలయం నిర్మించిన తర్వాత ఆయన సీతమ్మతల్లికి తండ్రిగా భావించి మంగళసూత్రం చేయిస్తాడు. ఈ కారణంతోనే ఏటా శ్రీరామనవమి రోజున జరిగే కల్యాణ మహోత్సవంలో అర్చకులు భక్తరామదాసు చేయించిన మంగళసూత్రాన్నీ సీతమ్మకు అలంకరిస్తారు.

నేటి పట్టాభిషేకానికి గవర్నర్..

సీతారామచంద్రస్వామి ఆలయ సన్నిధిలోని మిథిలా ప్రాంగణంలో గురువారం జరుగనున్న రామయ్య మహాపట్టాభిషేక వేడుకకు గవర్నర్ సీసీ రాధాకృష్ణన్ హాజరుకానున్నారు. గవర్నర్ రాక నేపథ్యంలో కలెక్టర్ ప్రియాంక ఆల బుధవారం అన్ని ప్రభుత్వశాఖల అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. గవర్నర్ పర్యటనలో ఎలాంటి లోటుపాట్లకు తావు ఉండొద్దని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, డీఆర్డీవో విద్యాచందన, జడ్పీ సీఈవో ప్రసూనరాణి పాల్గొన్నారు.


భద్రాద్రి నిండా భక్తజనం..

సీతారాముల కల్యాణ వైభవాన్ని తిలకించేందుకు మన రాష్ట్రం నుంచే కాక పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఎప్పటికప్పుడు ఏర్పాట్లను రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల, ఆలయ ఈవో రమాదేవి పర్యవేక్షించారు. ఎస్పీ రోహిత్‌రాజ్ ఆధ్వర్యంలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా భద్రాచలం ఏఎస్పీ పరితోశ్ పంకజ్, పోలీస్ సిబ్బంది బందోబస్తు చేపట్టారు. కల్యాణ మహోత్సవం పూర్తయిన తర్వాత భక్తులు తలంబ్రాల కోసం మండపంలోనికి చొచ్చుకురావడంతో కల్యాణ మూర్తులను ప్రధాన ఆలయంలోకి తీసుకెళ్లడం కాస్త ఆలస్యమైంది. ఆలయ అధికారులు పదే పదే మైక్‌లో సూచించినప్పటికీ భక్తులు వేదికపైకి దూసుకొచ్చారు.