11 May, 2026 | 5:56 PM

నల్లధన ప్రవాహం

08-05-2024 12:05 AM

దేశంలో ఎన్నికలు రానురాను ఖరీదైనవిగా మారుతున్నాయి. ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజూ పోలీసు ప్రత్యేక బృందాల తనిఖీల్లో పట్టుబడుతున్న కోట్లాది రూపాయలు దీనిని చెప్పకనే చెప్తున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి చేసే ఖర్చు వేలల్లో ఉంటే అది ఇప్పుడు కోట్లలోకి పెరిగిపోయింది. అప్పటో అభ్యర్థికి ఒకటో రెండో జీపులు, కరపత్రాలతో ప్రచారం చేస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు పదుల సంఖ్యలో ప్రచార వాహనాలు. లక్షలు ఖర్చు చేసి బహిరంగసభలు, ర్యాలీలు. వీటి కోసం జన సమీకరణ. ఇలా భారీఖర్చు వ్యవహారమైంది. ఓటరు మహాశయుడ్ని ప్రసన్నం చేసుకునేందుకు ఇచ్చే తాయిలాలు, నగదు పంపిణీ అన్నీ కలిపి మరింత భారీ ఖరీదు చేస్తున్నది. ప్రజాసేవ కోసం ఇంత ఖర్చుపెట్టాలా? కేవలం ప్రజాసేవ కోసమే అయితే ఎన్నికల్లో గెలవాల్సిన అవసరమే లేదని, వేరే మార్గాల్లో సైతం సేవ చేయవచ్చని అనుభవజ్ఞులు చెప్తారు.

రాజకీయాలు ఓ లాభసాటి వ్యాపారంగా మారినందునే రూపాయి ఖర్చు చేసి గెలిస్తే అంతకు పదిరెట్లు సంపాదించవచ్చనే ముందుచూపుతోనే ఎంతయినా ఖర్చు చేయడానికి వెనకాడడం లేదనేది పచ్చి నిజం. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వ్యక్తి పోటీ చేసినప్పుడు సమర్పించే ఆస్తుల వివరాలకు, అయిదేళ్లకు పెరిగే ఆస్తులకు ఎక్కడా పొంతన ఉండడం లేదు. ఇవన్నీ చూసిన తర్వాత అభ్యర్థుల ఎన్నిక వ్యయాన్నికూడా ప్రభుత్వమే భరిస్తే బాగుంటుందనే సలహా గతంలో కొన్ని వర్గాలనుంచి వచ్చింది.  రాజకీయ పార్టీలకు, నేతలకు ఈ ప్రతిపాదన నచ్చలేదో ఏమో తెలియదు కానీ అది తెరమరుగై పోయింది. గెలుపే ప్రధానంగా మారిన ఇప్పటి ఎన్నికల్లో అభ్యర్థులు విలువలకు ఎంతమేరకు  ప్రాధాన్యం ఇస్తారు? గెలిచిన ప్రజా ప్రతినిధి ఒకటి రెండేళ్లలోనే తాను పెట్టిన ఖర్చుకు మించి సంపాదించి తర్వాత వచ్చే ఎన్నికల కోసం కూడబెట్టడం మొదలు పెడుతున్నాడు.

అందుకే ఎన్నికల సమయంలో ఇలా కూడబెట్టిన నల్లధనమంతా కట్టలు కట్టలుగా బైటికి వస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఒక అంచనా ప్రకారం 2024 లోక్‌సభ ఎన్నికల కోసం అభ్యర్థుల ఖర్చు దాదాపు లక్ష కోట్లు ఉంటుందని అంచనా. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పెట్టిన మొత్తం ఖర్చు రూ 6,0-65 వేల కోట్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఎన్నికల ప్రక్రియ ్రప్రారంభమై, పోలింగ్ ముగిసేదాకా, దాదాపు రెండు నెలల పాటు ఓటరు అభ్యర్థులకు, రాజకీయ పార్టీలకు నిజంగానే యువరాజుగా మారిపోతాడు. ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా వ్యయ పరిశీలకులను నియమించినా వారి కళ్లబడకుండా గిఫ్ట్‌లు, నగదు, బంగారం, మద్యం ఇలా.. తాయిలాల రూపంలో ఇచ్చే వాటి వ్యయం ప్రతి ఎన్నికకూ పెరిగిపోతోంది. అభ్యర్థులు చేసే ఖర్చులో ఓటర్ల జేబుల్లోకి వెళ్లేది 25- శాతం మాత్రమేనని గత ఎన్నికలపై అధ్యయనం చేసిన ‘సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్’ (సిఎంసి) ఓ నివేదికలో పేర్కొంది. మిగతా మొత్తంలో 30- శాతం ఎన్నికల ప్రచారం, పబ్లిసిటీకి, మరో 8 శాతం రవాణా ఖర్చులు ఉంటాయని ఆ సంస్థ అంచనా వేసింది. ఇదంతా బయటికి కనిపించే ఖర్చు, కాగా కనిపించని ఖర్చూ ఉంటుంది. 

ఎన్నికల కమిషన్ విధించిన పరిమితుల ప్రకారమే అభ్యర్థులు అసెంబ్లీకయితే 28- లక్షలు, లోక్‌సభకైతే 75 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు. తొలి సార్వత్రిక ఎన్నికలలో ఈ పరిమితి రూ.25 వేలు మాత్రమే. పుచ్చలపల్లి సందరయ్య, వావిలాల గోపాలకృష్ణయ్య లాంటి వారైతే ఆ పరిమితి లోపలే ఖర్చు చేసి ఎన్నికల్లో విజయం సాధించారని చెప్తారు. కానీ, ఇప్పుడు ఏ అభ్యర్థికూడా ఈసీ నిర్ణయించిన పరిమితి మేరకు ఖర్చు చేసేవారు కనిపించరు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా చెప్పుకునే మన వ్యవస్థకు ఇది మాయని మచ్చ కాదా?  రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని ఎందుకు గ్రహించవు? ధనవంతులకే టికెట్లు ఇచ్చే సంస్కృతికి అవి ఎప్పుడు స్వస్తి చెబుతాయో చూడాల్సిందే.