11 May, 2026 | 4:48 PM

ఏ ఊరు నివాస యోగ్యం?

08-05-2024 12:10 AM

ధనికః, శ్రోత్రియో, రాజా, నదీ, వైద్యస్తు పంచమః

పంచ యత్ర నవిద్యంతే న తత్ర దివసే వసేత్!

చాణక్య నీతి  (19)

‘ఏ ఊరిలోనైతే ధనికుడు, శ్రోత్రియు డు, రాజు, నదులు, వైద్యులు ఉండరో ఆ ఊళ్లో ఒక్కరోజు కూడా ఉండకూడదు’ అన్నది చాణక్య నీతి. మనం చిన్నప్పుడు ‘సుమతీ శతకం’లో కూడా ఇలాంటిదే ఒక పద్యం నేర్చుకున్నాం. ‘అప్పిచ్చువా డు వైద్యుడు/ ఎప్పుడు ఎడతెగక పారు నేరును, ద్విజుడున్/ చొప్పడిన యూర నుండుము/ చొప్పడ కున్నట్టి యూర జొరకుము సుమతీ!’  

గొలుసు కట్టు జీవన విధానం

ఒక వ్యక్తి ధనవంతుడు కావాలి అంటే వ్యాపారం చేయాలి. వ్యాపారానికి అనువైన వాతావరణం ఉండాలి. వస్తు ఉత్పత్తి జరగాలి. దానికి అవసరమైన వనరులు అందుబాటులో ఉండాలి. రహదారులు, రవాణా సౌకర్యం కావాలి. కమ్యునికేషన్ వ్యవస్థ ఉండాలి. తయారైన వస్తువులు వినిమయం కావాలి. అంటే, ప్రజలలో కొనుగోలు శక్తి ఉండాలి. ఇవన్నీ ఎక్కడ ఉంటాయో అక్కడ ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. గౌరవ ప్రదమైన జీవనయానానికి లోపం ఉండదు.  అవసరానికి అప్పులు ఇచ్చి ఆదుకునే వారికి లోటుండదు. కాబట్టి, అటువంటి ఊరు నివాసయోగ్యం అన్నమాట.

మంచి చెడ్డలకు మూలం జ్ఞానం

‘శ్రోత్రియుడు’ అంటే శ్రుతి తెలిసిన వాడు. శ్రుతి అంటే వేదం. వేదం అంటే తెలుసుకొనడం. ఏది తెలుసుకోవాలి? ఏదైతే సమాజానికి హితకరమో, మానవ జీవనానికి ఉపయోగకరమో, దేని ద్వారానైతే ధర్మం ఆచరించబడుతుందో, ఏదైతే అపారమైన మానవ మేధకు పదును పెట్టగలదో దానిని తెలుసుకోవాలి. దాని నే ‘వేదం’ లేదా ‘శ్రుతి’ అంటారు. ఎవరైతే ఆ వేదాన్ని నిరంతరం అభ్యసి స్తూ, అధ్యయనం చేసిన దానిని అర్హులైన వారికి అందిస్తూ విజ్ఞానవ్యాప్తికి కృషి చేస్తారో అతడు శ్రోత్రియుడు. విజ్ఞానం కలిగిన వారు, మంచి చెడ్డల మధ్య భేదాన్ని తెలియచేయగల వివేచన గలిగిన వారు ఉన్న ఊరిలో శ్రేయస్సు, ప్రేయస్సుకు మార్గం కనిపిస్తుంది. శాస్త్ర సాంకేతిక ప్రగతి అక్క డ ఉంటుంది. కష్టకాలంలో సలహాలు లభిస్తాయి. ఆ వూరు నివాసయోగ్యం. 

రక్షణ బాధ్యత పాలకులది

మానవాభ్యుదయానికి శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం అత్యంతావశ్యకం. భూమి, శ్రమ లేదా శ్రామికులు, ఆర్ధిక వనరులు, ప్రణాళికాబద్ధ యోజనా నిర్వహణలు  ఈ నాలుగు ప్రధాన భూమికలుగా వ్యవసాయం లేదా పరిశ్రమలు లేదా సేవా రంగాలు పనిచేస్తాయి. వీటన్నింటికీ రక్షణ నిచ్చేది రాజ్య వ్యవస్థ. దానికి అధిపతే రాజు. వీరినే ఈ ప్రజాస్వామ్య యుగం లో మంత్రి లేదా ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రిగా భావించవ చ్చు. గ్రామసీమలతోపాటు దేశం, రాష్ట్రాలలోని వ్యవస్థలను రక్షిస్తూ, వాటిని మెరుగు పరిచే గురుతర బాధ్యత నేటి పరిపాలకులదే. కాబట్టి, రాజును రక్షణకు ప్రతీకగా గుర్తిస్తాం. అన్నీ ఉన్నా రక్షణ లేకపోతే, భయం రాజ్యమేలుతుంది. అప్పుడు ప్రజల బతుకు దుర్భరమౌతుంది. 

అన్యాయం జరిగిన వేళ దుర్మార్గాన్ని అణిచివేసి బలహీనులకు రక్షణ నివ్వగలిగిన మానసిక స్థితియే ‘క్షాత్రం’. ఎవరి లోనైతే క్షాత్రం ఉంటుందో అతడు ఇతరులకు రక్షణ సమకూర్చగలడు. బలం బలాన్ని గౌరవిస్తుంది. గౌరవాన్నందుకు న్న బలం ఆపన్నులను ఆదుకుంటుంది. అలాంటి రాజరిక వ్యవస్థ ఉన్న ఊరిలో ఉండడం వల్ల నిర్భయంగా ఉండగలుగుతాము. నదులు ముఖ్యంగా జలం ప్రాణ దాయిని. సాగునీరు, త్రాగునీరు ఉన్నచోట జీవనం సాఫీగా సాగిపోతుంది. నాగరికతలన్నీ నదీ ప్రాంతాలలోనే వెల్లివిరిసాయి. వ్యవసాయం, వ్యాపారం, పరిశ్రమలకు మూలాధారం నీరే. ‘ఆ నీటి వ్యవస్థ ఎక్కడ ఉంటుందో అక్కడ నివసించడం ఉత్తమం’ అంటారు చాణక్యులు. 

పాలకుర్తి రామమూర్తి

- వ్యాసకర్త సెల్: 9441666943