24 April, 2026 | 3:07 AM

మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనం

24-04-2026 01:31 AM

డాక్టర్ పద్మ వీరపనేని

జూబ్లీహిల్స్,ఏప్రిల్ 23(విజయక్రాంతి): బీజేపీ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా ఆక్రోష్ ర్యాలీలో బీజేపీ మహిళా మోర్చా జాతీయ నాయకురాలు డాక్టర్ పద్మ వీరపనేని పాల్గొని కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దశాబ్దాల కాలంగా మహిళలు కలలుగంటున్న మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తన మహిళా వ్యతిరేక ధోరణిని బయటపెట్టుకుందని విమర్శించారు.

ఒకవైపు ప్రధాని నరేంద్ర మోడీ మహిళా సాధికారత కోసం నిరంతరం శ్రమిస్తుంటే, కాంగ్రెస్ మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డంకులు సృష్టించడం సిగ్గుచేటని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ఈ ద్వంద్వ వైఖరిని దేశవ్యాప్తంగా ఉన్న మహిళా లోకం ముందు త్వరలోనే ఎండగడతామని హెచ్చరించారు. మహిళల హక్కులను కాలరాస్తు న్న కాంగ్రెస్ వైఖరికి వ్యతిరేకంగా త్వరలోనే భారీ ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని స్ప ష్టం చేశారు. మహిళల అభివృద్ధిని అడ్డుకుంటున్న వారు భవిష్యత్తులో మహిళా లోకం ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. దేశవ్యాప్తంగా మహిళలందరినీ ఏకం చేసి కాంగ్రెస్ పార్టీ అసలు రంగును బయటపెడతామని ప్రకటించారు.