ఐఐఎంసీ కాలేజీలో రక్తదాన శిబిరం
ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు
ఖైరతాబాద్, మార్చి 2 (విజయక్రాంతి): ఐఐఎంసి కళాశాల జాతీయ సేవా పథకం యూనిట్ I, II, నారాయణగూడలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ప్రభుత్వ రక్తనిధి వారి సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించబడింది. కళాశాలలోని చల్లా సోమ్ రాజ్ రామ్ సభా మందిరంలో ప్రారంభమైంది. జాతీయ సేవా పథక చైర్మన్, కళాశాల ప్రిన్సిపాల్ ప్రారంభించారు. రక్తదానం మూడు ప్రాణాలను కాపాడగలదని వివరించారు.
ఐ పి ఎం రక్త నిధి ప్రతినిధి డా.మాధవి మాట్లాడుతూ.. రక్తదానం చేయడం వల్ల దాత ఆరోగ్యానికి ఎలాంటి హానీ లేదని, శాస్త్రీయ విధానాల ప్రకారం పూర్తిగా భద్రతతో రక్తం సేకరిస్తామని తెలిపారు. ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ రామకృష్ణ ఇరుకుల్ల మాట్లాడుతూ, రక్తదానం మహత్తరమైన మానవ సేవ అని పేర్కొన్నారు.
ఈ రక్తదాన శిబిరం విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందించి, రక్తదానం ప్రాముఖ్యతను మరింతగా తెలియజేసిందని మరో ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ సత్యనారాయణ తెలిపారు. ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు, ఎన్‌సిసి కాడెట్స్, విద్యార్థులు, అధ్యాపకులు 62 యూనిట్ల రక్తదానం చేశారు. కార్యక్రమంలో కళాశాల డీన్లు డాక్టర్ తిరుమలరావు, డా. జి.సంతోషి, అధ్యాపకులు పాల్గొన్నారు.




