12 July, 2026 | 3:35 PM

Breaking News

విశాఖలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు   •   సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లేఖ   •   ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •  

కొత్త దళపతి ఈటల?

10-06-2024 01:21 AM

రాజేందర్ వైపు బీజేపీ అధిష్ఠానం చూపు 

నేడు అమిత్‌షాతో భేటీ

డీకే అరుణకూ అవకాశముందని ప్రచారం   

త్వరలో అధ్యక్ష మార్పునకు అవకాశం

హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి మరోసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన వేళ అందరి దృష్టి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై పడింది. కిషన్‌రెడ్డి తర్వాత ఈ బాధ్యతలు ఎవరు స్వీకరిస్తారని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలుగా విజయం సాధించగా, వీరిలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లను కేంద్ర మంత్రి పదవులు వరించాయి.

అసెంబ్లీ ఎన్నికల ముందు అనూహ్యంగా రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండిని తప్పించి కిషన్‌రెడ్డికి ఇచ్చారు. ఆ నిర్ణయం బెడిసికొట్టి బీజేపీకి అసెంబ్లీలో సీట్లు తగ్గాయనే చర్చ కూడ ఉంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగిసి.. కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి ఆయన తప్పుకొనే అవకాశం ఉందని పార్టీ నేతలు చెప్తున్నారు. కిషన్‌రెడ్డి తప్పుకుంటే ఆ స్థానంలో పార్టీ ఎవరిని నియమిస్తుందనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో బీజేపీ గతంలో ఎప్పుడు లేనంత ఊపులో ఉంది. ఈ పట్టును కొనసాగించాలంటే పార్టీని సమర్ధంగా నడిపించే నాయకుడు అవసరం అని, అలాంటి వారినే పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తామని అధిష్ఠానం స్పష్టం చేసినట్టు సమాచారం.

అధిష్ఠానం చూపు ఈటల వైపు

బీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరి ఉపఎన్నికలో హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్ సత్తాను పార్టీ ఆదిలోనే గుర్తించింది. అందుకే ఆయన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి అభ్యర్థిగా నిలబెట్టింది. అధిష్ఠానం నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. సీఎం రేవంత్‌రెడ్డి సిట్టింగ్ స్థానం నుంచి గెలిచిన ఈటలకు కేంద్రమంత్రి పదవి వస్తుందని కూడా ప్రచారం జరిగింది. అయితే రెండుసార్లు ఎంపీలుగా గెలిచిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు పార్టీ అవకాశం కల్పించింది.

బీసీ నేత అయిన ఈటల తనకు ఖచ్చితంగా కేంద్రమంత్రి పదవి లభిస్తుందని ఆశించారు. కానీ అవకాశం దక్కకపోవడంతో నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఈటలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని మోదీ షా ద్వయం నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో బలమైన బీసీ సామాజికవర్గానికి చెందిన ఈటల రాజేందర్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం వల్ల పార్టీకి సమీప భవిష్యత్తులో ఎంతో మేలు జరుగుతుందని కూడా పార్టీ భావిస్తోందని పలువురు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో ఎంతో అనుభవం ఉన్న నాయకుడు అవ్వడమే కాకుండా, మిగతా పార్టీల పైనా ఈటలకు సంపూర్ణ అవగాహన ఉందని, పార్టీని ఎలా ముందుకు నడిపించాలో ఆయనకు బాగా తెలుసని పార్టీ నేతలంటున్నారు.

ఈటలకు అవకాశం కల్పిస్తే బీసీల నుంచి కూడా పార్టీకి ఆదరణ లభిస్తుందని నేతలు భావిస్తున్నట్టు సమాచారం. అందుకే ఖచ్చితంగా ఆయనకు బీజేపీ రాష్ట్ర చీఫ్ బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు. ఈటల పేరును అధిష్ఠానం అధికారికంగా ప్రకటించడమే తరువాయి అని పార్టీకి చెందిన ముఖ్య నాయకులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఈటల రాజేందర్ ఆదివారం అమిత్‌షాతో ఫోన్‌లో మాట్లాడారు. సోమవారం అమిత్‌షాతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై చర్చించనున్నారని తెలుస్తోంది. దీన్ని బట్టి ఈటలకు దాదాపుగా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఖాయమని, అధికారికంగా వెల్లడించడమే తరువాయి అని నాయకులు అంటున్నారు.

డీకే అరుణకు సైతం అవకాశం?

సీఎం సొంత జిల్లా అయిన మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థిపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విజయం సాధించి తొలిసారి పార్లమెంట్‌కు వెళ్లారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రెండుసార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన డీకే అరుణ సైతం తనకు కేంద్ర మంత్రివర్గంలో మహిళా కోటాలో అవకాశం లభిస్తుందని ఆశించారు. ఊహించని విధంగా బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి రాకపోవడం, మిత్రపక్షాలకు సర్దుబాటు నేపథ్యంలో డీకే అరుణ లాంటి చాలా మంది ఆశావహులకు కేంద్ర మంత్రి పదవులు అందకుండా పోయాయి.

ఈ తరుణంలో డీకే అరుణకు సైతం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అరుణతోపాటు ఆదిలాబాద్ ఎంపీగా గెలుపొందిన ఎస్టీ సామాజికవర్గానికి చెందిన గోడాం నగేశ్‌కు సైతం అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. పార్టీ అధ్యక్షుడెవరనేది అతి త్వరలోనే తేలుతుందని బీజేపీ ఢిల్లీ వర్గాలు తెలిపాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సైతం కేంద్ర మంత్రి పదవి లభించడంతో, జాతీయ అధ్యక్ష పదవి కూడా ఖాళీ అవుతున్న తరుణంలో పదవులన్నింటినీ వెంటనే భర్తీ చేస్తారని తెలుస్తోంది.