calender_icon.png 17 October, 2025 | 4:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్లో అవుట్!

17-10-2025 01:33:10 AM

ప్రస్తుతానికి చల్లారింది!!

-మలుపు తిరుగుతున్న మంత్రుల మధ్య వివాదం 

-మేడారం టెండర్ల నుంచి డెక్కన్ సిమెంట్ కంపెనీ వ్యవహారం దాకా.. 

-అభివృద్ధి పనులు దేవాదాయ శాఖ నుంచి ఆర్ అండ్ బీకి బదలాయింపు

-మంత్రి సురేఖ  మాజీ ఓఎస్డీ సుమంత్ అరెస్టుకు పోలీసుల ప్రయత్నం 

-సురేఖ కుమార్తె సుస్మిత తీవ్ర ఆరోపణలు 

-కాంగ్రెస్ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్‌తో సురేఖ, సుస్మిత భేటీ

హైదరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి) : రాష్ట్రంలో మంత్రుల మధ్య రోజుకో వివాదం రాజుకుంటున్నది. మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మధ్య మేడారం అభివృద్ధి పనులకు సంబంధించి రూ.71 కోట్ల టెండర్ వివాదం సమసి పోకముందే, మంత్రి సురేఖ ఓఎస్డీని తొలగించిన అంశంపై మంటలు ఎగిసిపడ్డాయి. డెక్కన్ సిమెంట్ కంపెనీ ప్రతినిధులను   బెదిరించి, డబ్బు వసూళ్లకు పాల్ప డ్డారన్న అంశం ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. మంత్రి సురేఖ ఓఎస్డీగా పనిచేసిన సుమంత్‌ను ప్రభు త్వం, అనేక ఆరోపణల నేపథ్యంలో తొలగించడం అగ్గిరాజేసింది.

సుమంత్‌ను అరెస్టు చేసేందుకు జూబ్లీహిల్స్‌లోని మంత్రి కొండా సురేఖ నివాసానికి బుధవారం అర్ధరాత్రి  పోలీసులు వెళ్లగా ఆమె కుమార్తె సుస్మిత వారిని అడ్డుకోవడంతో  వివాదం మరింత ముదిరింది. కాంగ్రెస్ పార్టీలోని రెడ్లు తమ కుటుంబాన్ని అణచివేసేందుకు కుట్ర పన్నుతున్నారని సుస్మిత చేసిన ఆరోపణలు కలకలం సృష్టించాయి. తన కూతురు ఏం చెప్పిందో తనకు తెలియదని కాంగ్రెస్ నాయకుడు కొండా మురళి గురువారం ఉదయం స్పష్టం చేశారు.

తన ఓఎస్డీ సుమంత్‌ని తనకు తెలియకుండా తొలగించడం, మేడారం పనులను దేవాదాయ శాఖ నుంచి ఆర్‌అండ్‌బీ శాఖకు బదలాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేయడం మంత్రి సురేఖను ఇబ్బందిపెట్టే అంశాలుగా మారాయి. మీడియా ముందుకు వచ్చి జరుగుతున్న విషయాలపై వివరణ ఇవ్వాలని గురువారం ఉదయం మంత్రి సురేఖ నిర్ణయించుకోగా.. విషయం తెలుసుకున్న  పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్, మంత్రి కొండా సురేఖకు ఫోన్ చేసి మీడియా ముందుకు వెళ్లవద్దని, సమస్యను కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకుందామని సూచించడంతో సురేఖ మీడియా సమావేశం ఏర్పాటు చేయలేదని తెలిసింది.

డిప్యూటీ సీఎం భట్టితో కూడా..

పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్‌తో భేటీకి ముందు ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మంత్రి కొండా సురేఖ, ఆమె కూతురు సుస్మిత  భేటీ అయ్యారు.  ఈ భేటీలో బుధవారం  రాత్రి నుంచి జరిగిన పరిణామాలు, తన ఓఎస్డీ సుమంత్ వ్యవహారంపై వివరించినట్లు తెలుస్తోంది. అయితే మంత్రి సురేఖ ఎలాంటి అధికారిక భద్రత లేకుండా కేవలం తన వ్యక్తిగత వాహనంలో భట్టి నివాసానికి వెళ్లడం చర్చనీయాశంగా మారింది. ఆ తర్వాత మంత్రి సురేఖ క్యాబినెట్ సమావేశానికి కూడా హాజరుకాలేదు.

పొంగులేటి సైగలతోనే  ఫైళ్లు ముందుకు.. 

 గతంలో ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున  ఖర్గే సమక్షంలో తన తల్లి కొండా సురేఖను సీఎం రేవంత్‌రెడ్డి కించపర్చేలా మాట్లాడారని కొండా సుస్మిత ఆరోపించారు. మంత్రి పొంగులేటి సైగలు చేస్తేనే ఫైళ్లు ముందుకు సాగుతున్నాయని, తమ తల్లి కొండా సురేఖ శాఖకు చెందిన ఫైళ్లు మాత్రం నెలల కొద్ది పెండింగ్‌లో ఉంటాయని తెలిపారు. మేడారంలో రూ. 71 కోట్ల టెండర్ విషయంలో మంత్రి పొంగులేటి జోక్యం చేసుకున్నారని, ఆ  టెండర్ దేవాదాయ శాఖ నుంచి ఆర్‌అండ్‌బీ శాఖకు ఎందుకు మారిందో చెప్పాలని సుస్మిత డిమాండ్ చేశారు.  తామెప్పుడు కార్యకర్తల వెంటనే ఉంటామని, పదవులు, పైసలు శాశ్వతం కాదన్నారు. కార్యకర్తలు ఆధైర్యపడకుండా తమకు ధైర్యం కల్పించా లన్నారు. తాము ఏ తప్పు చేశామో అర్థం కావడం లేదని, తనను అరెస్టు చేస్తే కార్యకర్తలు ఖండించాలని, మద్దతుగా ఉండాలని ఆమె ఒక వీడియో సందేశంలో కోరారు. తమపై అనుసరిస్తున్న మొత్తం వ్యవహారాంపై త్వరలోనే పార్టీ అధిష్ఠానానికి ఫిర్యా దు చేస్తామన్నారు.

కుట్రలు జరుగుతున్నాయి.. 

తోటి మంత్రులతో వివాదం, తాజా పరిణామాలపై మంత్రి సు రేఖ, కూతురు సుస్మితతో కలిసి ఏఐసీసీ రాష్ర్ట ఇంచార్జీ మీనాక్షి, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌తో భేటీ అయ్యా రు. తనపై కుట్రలు జరు గుతున్నా యని మీనాక్షికి సురేఖ వివరించినట్లుగా తెలుస్తోంది. తనను, కుటుం బాన్ని, తన మనుషులను ఎవరెవ రు ఎలా ఇబ్బందులు పెడుతున్నా రో ఏకరువు పెట్టినట్లుగా సమాచా రం. బీసీ మహిళలను అయిన తన ను ఎన్ని కష్టాలకు గురిచేస్తున్నారో వివరించి బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పి బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. భేటీ అనంతరం మంత్రి సురేఖ మీడియాతో మాట్లాడుతూ.. తోటి మం త్రులతో తాను పడుతోన్న ఇబ్బందులు, ఆలోచనలు మీనాక్షికి  తెలి పానన్నారు. వారు కూడా తన అభ్యర్థనను విని, మంత్రులతో కూర్చొని మాట్లాడి త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి నట్లుగా సురేఖ పేర్కొన్నారు. తన బాధలు అన్ని వారితో పంచుకున్నానని, వాళ్లు ఇచ్చిన భ రోసా మేరకు తాను ముందుకు వెళ్తానని మంత్రి కొండా సురేఖ స్ప ష్టం చేశారు.

వివాదం ఏమిటి..? 

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సిమెంట్ కంపెనీల యజమాన్యాల ను మంత్రి కొండా సురేఖ వద్ద ఓఎస్డీగా ఉన్న సుమంత్ బెదరించినట్లు ప్రభుత్వం దృష్టికి రావడంతో గట్టిగా వ్యవహారించాలని నిర్ణయించినట్లు సమాచారం. భారీగా డబ్బులు ఇవ్వకపోతే పీసీబీ తరఫున చర్యలుం టాయని సుమంత్ హెచ్చరించగా, ఈ విషయాన్ని ఆయా కంపెనీల యాజమాన్యాలు మంత్రి ఉత్తమ్ దృష్టికి తీసుకుపోయినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  సీఎం రేవంత్‌రెడ్డి,  పార్టీ రాష్ట్ర వ్య వహారాల ఇన్‌చార్జి మీనాక్షికి చెప్పిన ట్లు సమాచారం. దీంతో సీఎం సీరియస్‌గా తీసుకుని, కంపెనీలను బెదిరించడంపై అవసరమైతే కేసు నమోదుచేసి చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు తెలిసిం ది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసు కో వాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం, ఇతర శాఖల్లో కూడా ఇలాం టి వారుంటే కఠినంగా వ్యవహరించాలని, ప్రభుత్వానికి నష్టం కలిగించే ఎలాంటి  చర్యలను  ఉపేక్షించరాద ని సీఎస్, పోలీసు ఉన్నతాధికా రుల కు సీఎం చెప్పినట్లు తెలిసింది. 

సీఎంతో వైరుధ్యం లేదు 

-నాకు ఎమ్మెల్సీ పదవీ ఇస్తానని చెప్పారు

-వైఎస్ అంత బలమైన నాయకుడు రేవంత్‌రెడ్డినే 

-కాంగ్రెస్ నేత కొండా మురళి కీలక వ్యాఖ్యలు 

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో తమకు ఎలాంటి వైరుధ్యాలు లేవని కాంగ్రెస్ నేత కొండా మురళి అన్నారు. రాజశేఖర్ రెడ్డి తర్వాత, తెలంగాణకు అంతటి వ్యక్తి రేవంత్ రెడ్డి అనుకున్నామని.. ఆయన సీఎం కావాలని కోరుకున్నవారిలో తనూ ఉన్నానని చెప్పారు. వైరుధ్యాలు ఎవరైనా సృష్టిస్తే దానికి తాను బాధ్యుడిని కానని చెప్పారు. బుధవారం రాత్రి సుమంత్‌ను అరెస్ట్ చేయడానికి మంత్రి కొండా సురేఖ ఇంటికి పోలీసులు రావడంపై కొండా మురళి స్పందించారు. వరంగల్‌లో పార్టీ మీటింగ్ ఉందని, అందుకోసమే ఇక్కడికి వచ్చానని, ఇంటివద్ద ఏం జరిగిందో తనకు పూర్తిగా తెలియదన్నారు. ఓఎస్డీ సుమంత్ విషయం కూడా తనకు తెలియదని, పార్టీ మీటింగ్‌కు కొండా సురేఖ కూడా వస్తున్నారని చెప్పారు.

రేవంత్ రెడ్డి తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. తను ఇప్పటివరకు ఒకసారి కూడా సచివాలయానికి వెళ్లలేదని, ఇకపై కూడా వెళ్లనని ఆయన స్పష్టం చేశారు. కొండా సురేఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆమె  చాంబర్‌లో వాస్తు చూడటానికి మాత్రమే ఒకసారి వెళ్లానని తెలిపారు. తనకు ఏమైనా అవసరం ఉంటే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి  ఇళ్లకు వెళతానని చెప్పారు. ‘నా కూతురు లండన్‌లో  పెరిగింది. ఆమెకు ఏ పదవి లేదు. ఆమెకు స్వేచ్ఛ ఉంది. ఆమె మాట్లాడిందో తెలియదు. నాకు ఫోన్ కూడా చూడరాదు అని ఆయన చెప్పారు. అయితే తనకు ఎవరూ టార్గెట్ కాదు.. తాను కూడా ఎవరికీ టార్గెట్ కాదని మురళి చెప్పారు. నన్ను టార్గెట్ చేస్తే, వారికే నష్టం అంటూ వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్‌తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని చెప్పారు.

రెడ్డి సామాజికవర్గం కుట్రలు: సుస్మిత 

బీసీ లీడర్లయిన తమ తల్లిదండ్రులు మంత్రి కొండా సురేఖ, కొండా మురళిని పార్టీ నుంచి బహిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇదంతా కాంగ్రెస్ పార్టీలోని రెడ్డి సామాజికవర్గం నాయకులు కుట్ర చేస్తున్నట్లుగా తెలుస్తోందని కొండా సుస్మిత్ ఆరోపించారు. ఈ మొత్తం వ్యహారం వెనుక సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కడియం శ్రీహరి, డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డితో సహా సీఎం రేవంత్‌రెడ్డి కూడా  ఉన్నాడని ఆమె బుధవారం రాత్రి తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ నక్సలైట్ అయిన తన తండ్రి కొండా మురళికి హాని ఉన్నప్పటికి బందోబస్తును తొలగించారని, అలాంటప్పుడు సీఎం సోదరులకు మాత్రం గన్‌మెన్‌లు ఎందుకని ఆమె ప్రశ్నించారు.

డెక్కన్ సిమెంట్‌కు సంబంధించిన వ్యక్తులను సుమంత్ గన్‌తో బెదరించారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదుతోనే ఇక్కడికి వచ్చామని పోలీసులు చెప్పారని సుస్మిత పేర్కొన్నారు. ఆధారాలుంటే చూపించాలని పోలీసులను అడిగానని, ఆధారాలు అడిగితే వరంగల్‌లో  నమోదైన మరో కేసులో అరెస్టు చేసేందుకు వచ్చామని పోలీసులు సమాధానమిచ్చారని సుస్మిత చెప్పారు.  అయితే డెక్కన్ సిమెంట్ ప్రతినిధులతో మాట్లాడినప్పుడు కాంగ్రెస్ నేత రోహిన్‌రెడ్డి కూడా ఉన్నాడని, మరి ఆయన వెనకున్న సీఎంకు కూడా పాత్ర ఉందా..? అని ఆమె ప్రశ్నించారు. సుమంత్‌ను అడ్డం పెట్టుకుని తన తల్లిని అరెస్టు చేసేందుకే మహిళా పోలీసులు కూడా వచ్చారని ఆమె ఆరోపించారు.