హోర్ముజ్‌లో మైన్ల నౌకలను కాల్చేయండి
- ఆ సిబ్బందిని చంపేయండి
- అమెరికా సైన్యాన్ని ఆదేశించిన ట్రంప్
వాషింగ్టన్, ఏప్రిల్ 23: ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అమలులో ఉన్న సమయంలో హోర్ముజ్ జలసంధిలో మైన్లను అమర్చే ఏ నౌకలనైనా కాల్చేయాలని ట్రంప్ తమ సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. జలసంధిలో ఏ మాత్రం మందుపాతరలు పెట్టే ఇరాన్ నౌకలు ఏవైనా కూల్చేయాలని, అందులోని సిబ్బందిని మట్టుబెట్టాలని అమెరికా నౌకాదళాన్ని ఆదేశించారు. ఈ మేరకు ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో గురువారం పేర్కొన్నారు. హోర్ముజ్ జలసంధిలో మైన్లు పెడుతున్న ఏ చిన్న పడవనైనా వదులొద్దని, కాల్చి ధ్వంసం చేయాలని నేవీని ఆదేశించానని వెల్లడించారు. ఇందులో ఏ మాత్రం సంకోచించొద్దని చెప్పానని తెలిపారు.
అమెరికా మైన్ స్వీపర్లు ప్రస్తుతం జలసంధిని క్లియర్ చేస్తున్నాయని, ఈ కార్యాచరణను మూడు రెట్ల వేగంతో అమలు చేయాలని ఆదేశించారు. ఇరాన్ ప్రస్తుతం తమ నాయకుడు ఎవరో తేల్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతుందన్న ట్రంప్.. హోర్ముజ్‌పై తాము పూర్తి నియంత్రణ సాధించినట్లు చెప్పారు. అమెరికా నేవీ అనుమతి లేకుండా ఏదైనా నౌక ప్రవేశించడం గానీ, బయటికి వెళ్లడం గానీ జరగబోదన్నారు. ఇరాన్ ఒప్పందానికి వచ్చి తీరాల్సిందేనని ట్రంప్ పేర్కొన్నారు.






