సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పోరాటం
డిసిసి అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్
పాలమూరులో కాంగ్రెస్ శ్రేణుల ర్యాలీ
మహబూబ్ నగర్ (విజయక్రాంతి) : సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. హల్దాని ఘటనకు నిరసనగా, ఏఐసీసీ అధ్యక్షురాలు మల్లికార్జున్ ఖర్గేకు సంఘీభావంగా డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ నాయకత్వంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ, సత్యాగ్రహ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చారు. డీసీసీ అధ్యక్షులు మాట్లాడుతూ హల్ద్వానిలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో నిర్వహించిన ర్యాలీ ప్రదేశాన్ని గంగాజలంతో శుద్దీకరణ పేరుతో అవమానకరంగా వ్యవహరించడం సరికాదన్నారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలాంటి సంఘటనలు అలవాటుగా మారిపోయాయని అన్నారు. ఖర్గే దళిత నాయకుడు అవడం వల్ల ఆయన సభ నిర్వహించిన ప్రాంతాన్ని శుద్ధి చేశారని, ఇది బీజేపీకి దళితుల పట్ల ఉన్న ఆలోచన విధానానికి అద్దం పడుతుందని విమర్శించారు. రాజ్యాంగ విలువలను కాపాడేందుకు కాంగ్రెస్ శ్రేణులు ఐక్యంగా ముందుకు సాగుతాయని తెలిపారు. కార్యక్రమంలో మేయర్ గుమ్మాల మమత, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ ,మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ గౌడ్, నాయకులు వినోద్ కుమార్, మిథున్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, జహీర్ అఖ్తర్, చంద్రకుమార్ గౌడ్ , బెక్కరి మధుసూదన్ రెడ్డి, సీజే బెనహర్, నిత్యానందం, అశోక్ కుమార్, మినాజ్, పసుల రాజు, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.






