15 August, 2026 | 10:41 AM

ఎల్లమ్మ ఆలయంలో చోరీ కేసును చేదించిన పోలీసులు

15-08-2026 09:10 AM

36 గ్రాముల బంగారు ముక్కుపోగులు, ద్విచక్ర వాహనం స్వాధీనం

సదాశివనగర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సంతోష్ కుమార్

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మారావుపేట్ గ్రామంలోని ఎల్లమ్మ ఆలయంలో బంగారు ముక్కుపోగులు చోరీకి గురైన ఘటనపై ఆలయ నిర్వాహకులు సదాశివనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు సదాశివ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సంఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరించి, నిందితుల కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు. దర్యాప్తులో సదాశివ నగర్ కు చెందిన తోగరి శ్రీనివాస్, తోగరి మల్లేశ్వరి, లు చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. 8 ఆగస్టు 2026 న ఇద్దరూ కలిసి ధర్మారావుపేట్ గ్రామంలోని ఎల్లమ్మ ఆలయం వద్దకు వెళ్లారు. ఆలయానికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన వారు  పక్కన ఉన్న రాయితో ఇనుప గేటు తాళాన్ని పగులగొట్టి ఆలయంలోకి ప్రవేశించి, అమ్మవారి విగ్రహాలకు అలంకరించి ఉన్న బంగారు ముక్కుపోగులను చోరీ చేసినట్లు దర్యాప్తులో ఒప్పుకున్నారు.

చోరీ చేసిన బంగారు వస్తువులను వెంటనే విక్రయించకుండా ఇంట్లోని బీరువాలో దాచిపెట్టారు. అనంతరం 14-08-2026న ఇద్దరూ చోరీ చేసిన బంగారు ముక్కుపోగులను కామారెడ్డిలో విక్రయించేందుకు హీరో సీడీ డీలక్స్ మోటార్‌సైకిల్‌పై బయలుదేరారు. మర్కల్ X రోడ్డు, 44వ జాతీయ రహదారిపై సదాశివ నగర్ పోలీసులు  వాహన తనిఖీలను గమనించిన నిందితులు పట్టుబడతామనే భయంతో మోటార్‌సైకిల్‌ను వెనక్కి తిప్పి పారిపోయేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని వెంబడించి చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఇద్దరు నిందితులు నేరాన్ని అంగీకరించగా, వారి వద్ద నుంచి ఎల్లమ్మ ఆలయం నుంచి చోరీకి గురైన మొత్తం 36 గ్రాముల బంగారు ముక్కుపోగులు, చోరీకి  ఉపయోగించిన హీరో సీడీ డీలక్స్ మోటార్‌సైకిల్ను  పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సదాశివ్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ తెలిపారు. వారిద్దరిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. దొంగలను పట్టుకోవడంలో సదాశివ్ నగర్ ఎస్సై పుష్పరాజ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.