15 August, 2026 | 9:54 AM

కాంగ్రెస్ పార్టీకి కాంట్రాక్టర్ల పైన ఉన్న ప్రేమ విద్యార్థులపైన లేదు

15-08-2026 09:05 AM

ఫీజు బకాయిలను చెల్లించకుండా విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,టాస్క్ జిల్లా కన్వీనర్ డాక్టర్ బాలు

కామారెడ్డి, ఆగస్టు 14 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్  బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలు డిమాండ్ చేశారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో వివిధ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు ప్రస్తుతం విద్యనభ్యసిస్తున్న వారి పరిస్థితి, కళాశాలల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందన్నారు.వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంట్రాక్టర్ల మీద ఉన్న ప్రేమ పేద విద్యార్థుల పైన లేదని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టాస్క్ జిల్లా కన్వీనర్ డాక్టర్ బాలు శుక్రవారం ఆరోపించారు. 

ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ మూడు సంవత్సరాలకు సంబంధించిన ఫీజు బకాయిలను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు కోర్సులను పూర్తి చేసుకున్న వారి యొక్క సర్టిఫికెట్లను కళాశాలలో నుండి తీసుకువెళ్లే పరిస్థితి లేదని అన్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫీజు బకాయిలు పూర్తిగా చెల్లించడంలో విఫలం కావడం జరిగిందని రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులు తగిన గుణపాఠం కాంగ్రెస్ పార్టీకి చెప్తారని అన్నారు. గతంలో అధికారంలోకి వస్తే పూర్తి బకాయిలను చెల్లిస్తామని ఎన్నో సందర్భాల్లో చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్న ఫీజుబకాయలను ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. ఫీజు బకాయిల గురించి అడిగితే గత ప్రభుత్వానికి సంబంధించిన ఫీజుబకాయలను నేనెందుకు చెల్లిస్తానని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఇన్ని రోజుల్లో ఎంతమంది కాంట్రాక్టర్లకు గత ప్రభుత్వాలకు సంబంధించిన పెండింగ్ బిల్లులను చెల్లించడం జరిగిందో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ఫీజుబకాయల విడుదల కోసం విద్యార్థులతో కలిసి ఉద్యమ బాట పడతామని అన్నారు.