24 August, 2026 | 10:35 AM

వర్షాలు కురుస్తలేవని కుళ్ళిన శవాన్ని తీసి మళ్ళీ ఖననం.!

24-08-2026 10:04 AM
  1. దళిత మృతదేహనికి ఘోర అవమానం. 
  2. పదర మండలంలో వెలుగు చుసిన అమానవీయ ఘటన. 
  3. మూఢనమ్మకంతో మృతదేహాన్ని వెలికితీసి మరోసారి దహనం

నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): నాగర్‌ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) పదర మండలం కోడంపల్లి గ్రామంలో మూఢనమ్మకంతో మృతదేహాన్ని సమాధి నుంచి వెలికితీసి మరోసారి దహనం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. గ్రామంలో వర్షాలు కురవకపోవడానికి ఓ వ్యక్తి మృతదేహాన్ని పూడ్చిపెట్టడమే కారణమనే మూఢ విశ్వాసంతో ఈ దారుణానికి పాల్పడ్డారు. 

గ్రామానికి చెందిన కొయ్యల రామాంజనేయులు మే నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. అనంతరం కుటుంబ సభ్యులు హిందూ సంప్రదాయాల ప్రకారం మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. అయితే గ్రామంలో వర్షాలు సక్రమంగా కురవకపోవడంతో మృతదేహాన్ని పూడ్చిపెట్టడం వల్లే వర్షాలు పడటం లేదని కొందరు గ్రామస్తులు మూఢనమ్మకానికి లోనయ్యారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం జేసీబీ సహాయంతో సమాధిని తవ్వి మూడు నెలల క్రితం పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీశారు.

అనంతరం కట్టెలు పేర్చి పెట్రోల్‌ పోసి దహనం చేసినట్లు తెలిసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మూడు నెలల క్రితం అంత్యక్రియలు పూర్తయిన మృతదేహాన్ని తిరిగి వెలికితీసి దహనం చేయడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడక పోవడానికి మృతదేహాన్ని పూడ్చిపెట్టడానికి ఎలాంటి సంబంధం లేదని, ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. ఘటనపై అధికారులు సమగ్ర విచారణ జరిపి మూఢనమ్మకాలను ప్రోత్సహించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.