24 August, 2026 | 10:38 AM

నిశ్చితార్థం రోజే విషాదం.. కారు ప్రమాదంలో యువకుడు మృతి

24-08-2026 10:06 AM

కల్వకుర్తి ఆగస్టు 24 : కల్వకుర్తి మండలం పంజాగుల సమీపంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నరేందర్(26) అనే యువకుడు మృతి చెందాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం కల్వకుర్తి మండలం గుండూరు గ్రామానికి చెందిన నరేందర్‌ ప్రభుత్వ ఉద్యోగం కోసం సిద్ధమవుతున్నాడు. ఆదివారం తన వివాహ నిశ్చితార్థం అమ్మాయి ఇంటి వద్ద జరగడంతో కార్యక్రమం పూర్తిచేసుకుని స్వగ్రామానికి వచ్చాడు. అనంతరం మిత్రులతో కలిసి కారులో కల్వకుర్తికి బయలుదేరాడు.

పంజుగుల సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన పడిపోయింది. ఈ ఘటనలో నరేందర్‌పై కారు పడటంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న మరో ఇద్దరికి గాయాలు కావడంతో వారిని కల్వకుర్తిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిశ్చితార్థం జరిగిన రోజే నరేందర్‌ మృతి చెందడంతో  గుండూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చేతికొచ్చిన కుమారుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.