గోల్కొండలో బోనాల సందడి
డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాల నడుమ జగదాంబిక అమ్మవారి రెండో బోనం
భక్తజనసంద్రంగా మారిన కోట
రాజేంద్రనగర్, జూలై 19 (విజయ క్రాంతి): భాగ్యనగరంలో ఆషాఢ మాస బోనాల జాతర సంబురాలు ఆదివారం అంబరాన్నంటాయి. చారిత్రాత్మక గోల్కొండలో కొలువైన జగదాంబిక అమ్మవారికి రెండో బోనం సందర్భంగా కోట పరిసరాలు భక్తజనసంద్రంగా మారాయి. అమ్మవారికి బోనాలు సమర్పించి, మొక్కులు చెల్లించు కునేందుకు హైదరాబాద్ నగరంలోని నలుమూలల నుంచే కాకుండా, శివారు ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఆదివారం తెల్లవారుజాము నుంచే మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బోనాలను ఎత్తుకుని, మంగళహారతులు పాడుతూ కోట మెట్లను ఎక్కడం విశేషంగా నిలిచింది. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లు గోల్కొండ కోటలో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపాయి.
పటిష్ట ఏర్పాట్లు
భక్తుల రద్దీ భారీగా పెరిగిన నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవదాయశాఖ అధికారులు, ట్రస్ట్ కమిటీ సభ్యులు, నగర పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. భక్తులు ఇబ్బంది పడకుండా ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. వృద్ధులకు, చిన్న పిల్లలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కోట మార్గమధ్యంలో పలుచోట్ల ఉచిత తాగునీటి కేంద్రాలను, అత్యవసర వైద్య సేవల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలను, అంబులెన్స్ అందుబాటులో ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. సీసీటీవీ కెమెరాల ద్వారా కంట్రోల్ రూమ్ నుంచి రద్దీని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.






