18 June, 2026 | 3:40 AM

ఏడు రకాల సన్నాలకే బోనస్

18-06-2026 02:25 AM
  1. విత్తనాలు కొరత లేకుండా చూడాలి
  2. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 
  3. ఖరీప్‌పై మంత్రి తుమ్మల సమీక్ష  

హైదరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి) : ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఈ ఏడు వరి రకాలకే బోనస్ వర్తిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి విత్తనాలు, ఎరువుల, వ్యవసా యంలో సాంకేతికత అమలుకు అధికారులు సన్నద్ధంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. కంపెనీల వారీగా అందుబాటులో ఉన్న విత్తనాల నిల్వలను రైతులకు తెలిసేలా ప్రదర్శించాలని మంత్రి సూచించారు.

అదేవిధంగా ఆయా రకాల అమ్మకం, విక్రయాలను రోజు వారీగా అప్ డేట్ చేయాల్సిందిగా డీలర్లను ఆదేశించారు. బుధవారం సచివాల యంలో విత్తన కంపెనీల ప్రతినిధులు, ఎరువుల డీలర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, కృషి వాస్ ప్రతినిధులతో మంత్రి తుమ్మల విడివిడిగా సమావేశమై ఖరీఫ్ సీజన్ ఏర్పాట్లపై సమగ్రంగా సమీక్షించారు.

విత్తన కంపెనీలతో జరిగిన సమావేశంలో మార్కెట్ డిమాండ్, మిల్లర్ల సూచనలు, ఎగుమతి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహి స్తున్న ఏడు వరి రకాల విత్తనాల లభ్యతపై మంత్రి తుమ్మల సమీక్షించారు. బీపీటీ-5204 (సాంబమసూరి), ఆర్‌ఎన్‌ఆర్-15048 (తెలంగాణ సొన), హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్‌ఎం-1638 (కూనారం సన్నాలు), డబ్ల్యూజీఎల్-44 (సిద్ధి), కేఎన్‌ఎం-7715 రకాల విత్తనాలను రైతులకు విస్తృతంగా అందుబాటులో ఉంచాలని సూచించారు.

ప్రభుత్వం సన్నాలకు బోనస్ ప్రకటించిన తర్వాత పరిస్థితి మారి ప్రస్తుతం సన్న రకాల సాగు 60 శాతానికి చేరుకుందని వివరించారు. ప్రభుత్వం సూచించిన విత్తనాలను రైతులకు ఎలాంటి కొరత లేకుండా అందుబాటులో ఉంచాలని కంపెనీలకు ఆదేశించారు. విత్తన సబ్సిడీపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుందని, వ్యవసాయ యాంత్రీకరణ పథకం తరహాలో సబ్సిడీ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

ఫెర్టిలైజర్ డీలర్లతో జరిగిన సమావేశంలో ఖరీఫ్ సీజన్‌లో ఎరువుల సరఫరా, పంపిణీ అంశాలపై మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. ఫెర్టిలై జర్ యాప్ వినియోగదారులకు, డీలర్లకు అనుకూలంగా ఉందని డీలర్లు అభిప్రాయపడ్డారు. రైతులకు ఎరువుల సరఫరా బాధత్య ప్రభు త్వం, డీలర్లదే అని మంత్రి పేర్కొన్నారు.