18 June, 2026 | 3:40 AM

‘సర్’ ప్రక్రియలో ముస్లిం ఓట్లే టార్గెట్

18-06-2026 02:23 AM

ప్రజలతో రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్ ముఖాముఖి..  

హైదరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): ఎస్‌ఐఆర్ ప్రక్రియ అందరి అంశమైనా ముస్లింల ఓట్లనే టార్గెట్ చేస్తారని రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్ ఆరోపించారు. సర్ పేరుతో ముస్లింల ఓట్లను తొలగించే అవకాశం ఉందని, అందుకు ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. పశ్చిమబెంగాల్, బీహార్‌లో ముస్లింల ఓట్లను తొలగించి బీజేపీ అధికారంలోకి వచ్చిందని, తెలంగాణలోనూ అలాంటి కుట్రలకు పాల్పడే అవకాశం ఉందన్నారు.

బుధవారం గాంధీభవన్‌లో మంత్రి అజారుద్దీన్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులు తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లా డారు. ‘సర్’ అంశంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఎవరి ఓటును వాళ్లే కాపాడుకునే బాధ్యత తీసుకోవాలని సూచించారు.

వివిధ సమస్యలతో ప్రజలు గాంధీభవన్‌కు వచ్చి సుమారు 200 పైగా దరఖాస్తులు ఇచ్చారని తెలిపారు. తనకు సాధ్యమైనంత వరకు వచ్చిన అభ్యర్థనలపై అక్కడే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేశానని, 50 దరఖాస్తుల సమస్యలను కలెక్టర్‌తో మాట్లాడి పరిష్కరించి నట్లు మంత్రి తెలిపారు.