ఎవ్వనిచే జనించు!
జిజ్ఞాసే తత్తదర్శనానికి తొలిమెట్టు. కంటికి కనిపిస్తున్న, నడుస్తున్న నిరంతరం పరిణామం చెందుతున్న ఈ సృష్టికి మూలమేమిటి? దాని వెనక దాగిన శక్తి ఏమిటి? ఇంత అద్భతంగా గతి తప్పకుండా సాగుతున్న ఈ కదలికలను, నానానేక చర్యలకు చోదక శక్తి ఏది? అనే ప్రశ్నలు సహజమైనవి. అనివార్యమైనవి. ‘ఎవ్వనిచే జనించు..’ అన్న పోతన మహాకవి జిజ్ఞాస ‘అట్టి ఆత్మభవు, ఈశ్వరు..’ అంటూ తత్తదర్శనంగా ముగుస్తుంది.
ఆలోచనల పుట్టుక ఎట్లా? అన్ని ఆలోచనలు కలిసి మనసు ఎట్లా అవుతున్నది? ఆ మనసుకు చలనాన్ని, వేగాన్ని ఇస్తున్నది ఎవరు? వాక్కు ఎట్లా పురుడు పోసుకుంటున్నది? దానికి మూలమైన భావన, భావం, భాషలను ఎవరు సమకూరుస్తున్నారు? ఎవరు అమరుస్తున్నారు? వాక్కు, ఒక స్పష్టతను, మాధుర్యాన్ని, గాంభీర్యాన్ని, అర్థాన్ని, పరమార్థాన్ని, శక్తిని పొందగల నేర్పును ఎవరు అలదుతున్నారు? పొదుగుతున్నదెవరు?
కంటికి దృశ్యాన్ని చూపిస్తున్నదెవరు? కాలులో ముళ్లు గుచ్చుకుంటే కన్నెందుకు ఏడుస్తున్నది? ఆ కన్నీరు ఎలా కారుతున్నది? దాని వెనక ఉన్న యంత్రమేమిటి? ఈ అనుబంధ సంబంధ సమన్వయక్రీడను సాగిస్తున్నది ఎవరు? శాసిస్తున్నది ఎవరు? నియంత్రిస్తున్నది ఎవరు? నిగ్రహిస్తున్నది ఎవరు? శమిస్తున్నదెవరు? కేవలం కట్టెగా జడాత్మకమైన శరీరం కరచరణాది అవయవాల ద్వారా భిన్న భిన్న కార్యకలాపాలను ఎలా నిర్వర్తిస్తున్నది? చెవులు వినగలగటం వెనుక దాగిన సూత్రమేమిటి? ఇది కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియా లు ఇంతటి సమన్వయంతో పని చేయడం ఎవరి నేతృత్వంలో? ఎవరి ప్రేరణ వలన..? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం ఒక్కటే. అది ‘ఆత్మ’ అని!
మనం ధరించే చేతి గడియారంలో మూడు ముల్లులు ఆగకుండా తిరుగుతూ కాల ప్రమాణా న్ని మనకు చూపించడం వెనక, గడియారం లోపల తాను కదలకుండా ముల్లులకు కదిలే శక్తిని ఇస్తున్న ‘బ్యాటరీ’ వలె, ఈ సృష్టిలో జరిగే సమస్త కార్యకలాపాలకు ఆత్మే కారణమౌతున్నది. శంకర భగవత్పాదులు, ‘ఆత్’ అంటే ‘ఏమీ’, ‘మా’ అంటే ‘లేదు’ అని ఆత్మను గురించి వ్యాఖ్యానించినప్పు డు, ఆత్మ అంటూ ప్రత్యేకంగా లేదని, కానీ ఉన్న దంతా ఆత్మేనని తత్తం బోధపడుతుంది.
ఇనుప పెట్టెలో వజ్రాలనగ ఎట్లా ఉంచబడిం దో శరీరంలో ఆత్మ, సర్వాణువుల యందు నిండివున్నది. అన్ని ప్రజ్ఞలూ ఆత్మ నుండీ ప్రసార మయ్యేవే? హృద్గుహలో ఆత్మ నేనుగా నినదిస్తున్నది, ప్రకాశిస్తున్నది.
అందువల్లనే ‘సర్వం ఖల్విదం బ్రహ్మ’ అన్న తత్తం అనుభవమౌతున్నది. ప్రాణం, చైతన్యం, శక్తి.. వంటివన్నీ ఆత్మశక్తులే! అంటే సర్వేంద్రియాలనూ ఆత్మే ప్రేరేపిస్తున్నది. కనుక సమస్త కార్యనిర్వహణ వెనుక ఉన్నదీ ఆత్మే అన్న భావన ధృడతరమౌతున్నది.
అటువంటి మూలాన్ని పట్టుకొనే ప్రయత్నమే ఆత్మాన్వేషణ. ఫలించిన ప్రయత్నమే ఆత్మసాక్షాత్కారం! అంటే ఆత్మ, సాక్షాత్తు ఆకారమై కనిపి స్తున్నది అని అర్థం. కనుక ఆత్మసాక్షాత్కారం అంటే దైవసాక్షాత్కారం కాదు. దైవం ఒక భావన, అది ఒక అంతర్గత శక్తి. మనం భావించే దైవం నామ, రూప, గుణ, విశేష, వైభవోల్లసితం. ఆత్మ నిర్వికార, నిరామయ, నిరంజన, నికేతన స్థితి! అది కాలాద్యవిచ్ఛిన్నం. అపరిణామప్రాప్తం, అప్రమేయం! ఈ తత్తదర్శనం, కడగా, ‘ఈశ్వరోగురు రాత్మేతి’ అనే అనుభవాన్ని ప్రసాదిస్తున్నది. అంటే దైవం, గురువు, ఆత్మ ఒకటే అని!
ప్రతి క్షణమూ నశించే, లేదా మార్పు చెందే పదార్థానికీ, విషయాన్ని విడమరిచి బోధించే గురువుకూ, ఈ అన్నిటికీ మూలమైన ఆత్మకూ తేడా లేదు! అంతా ఒక్కటే! బయట కనిపిస్తున్న వస్తువుల మూలాన్వేషణ పూర్తయిన తర్వాత కలిగే స్థిర అభిప్రాయం ఏమిటి? అని ఆలోచించినప్పుడు అది ఒక మహా ప్రజ్ఞ! అంతటికి అదే మూలం! అదే అనంత శక్తి! పదార్థం కలిగిం చే పరమార్థం, పరమార్థం ఆవిష్కరించే యదార్థం నిశ్చలానందాన్ని కలిగిస్తయ్. దానినే వేదాంతులు బ్రహ్మానం దం అన్నారు. ‘ఎవరి వలన’ అంటూ ప్రారంభమయే కేనోపనిషత్, ఆత్మాన్వేషణకు ముఖద్వారం, అది సింహద్వారం!
- వీఎస్‌ఆర్ మూర్తి






