ప్రాణికోటికి పెన్నిధి ‘గీతామృతం’
శ్రీమద్ భగవద్గీతలో ముల్లోక రాజ్యాంగ విధానాలకు కావలసిన మూల సూత్రాలన్నీ వున్నాయి. విశ్వమానవులందరికీ ఈ గీత సిద్ధాంతాలు వర్తిస్తాయి. అర్జునునికి గీతను ఉపదేశించి వేలాది సంవత్సరాలు గడచినా నేటికీ మానవాళి గీతార్థ సారంతో లాభం పొందుతున్నది. భారతీయులేగాక ప్రాక్పశ్చిమ దేశాల వారు గీతాజ్ఞానాన్ని ఆశ్రయించి తమ జీవితాలను పునర్నిర్మించుకొంటూ ధన్యులవుతున్నారు. గీతలో శ్రీకృష్ణపరమాత్మ అర్జునునికి చెప్పినవి మాటలు కావు, జ్ఞాన కణికలు. ఉపనిషత్తుల తోటలోంచి ఆధ్యాత్మిక సత్యాలనే పుష్పాలను ఏరి కూర్చిన మాలగా వివేకానంద స్వామి గీతాసారాన్ని అభివర్ణించారు.
“ప్రపంచ సాహిత్యమంతటిలోనూ గీతకు దీటు రాగల గ్రంథం వేరొకటి లేదు. మహా ప్రకాశమానమైన అమూల్య రత్నమిది. ఇది మనలను పరమానంద పదవికి గొనిపోవడంలో అపూర్వ సాధనం వంటిది” అని బాలగంగాధర్ తిలక్ అభిప్రాయపడ్డారు. సంసార సాగరాన్ని సులభంగా దాడటానికి గీతను పఠనం, అందులోని సూత్రాలు అత్యంత ఆచరణీయమని మలయాళ స్వాములు అన్నారు.
“మానవుడు తన మేధస్సునంతనీ ధారబోసినా గీతాజ్ఞానంలోని ఒకానొక అంశాన్ని మాత్రమే తెలుసుకొని తెలుపగలడు” అని అరవింద యోగి పేర్కొన్నారు. “విశ్వ వాఙ్మయమంతటిలోనూ గీతవంటి మహెూన్నత గ్రంథరాజం మరొకటి లేదు. అది జ్ఞానభాండారం, తరగని నిధి, ఆనంద సాగరం” అని శివానంద సరస్వతి స్వాముల వారు అన్నారు. “నా శరీరవృద్ధికి తల్లిపాలు ఎంతగా ఉపయోగపడినవో, నా బుద్ధి వికాసానికి భగవద్గీత అంతకంటే ఎక్కువగా ఉపయోగపడింది” అని శ్రీ వినోబాభావే తెలియజేశారు. ఇంతేకాదు, గీత గురించి ఇంకా అనేకమంది మహానుభావులు తమ అమూల్యమైన అభిప్రాయాలు తెలిపరు.
“భారతదేశానికి చెందిన సర్వప్రియ కావ్యమయ దార్శనిక గ్రంథం గీతయే. లేనిచో ఆంగ్ల సాహిత్యం అసంపూర్ణంగనే ఉండేది” అని ఎడ్విన్ ఆర్నాల్ అన్నారు. వారన్ హేస్టింగ్స్ “ఉన్నత శిఖరాలను అధిరోహింపదలచే మానవులకు గీతోపదేశం అద్వితీయమైంది” అని పేర్కొన్నారు. భగవద్గీతలోని అపూర్వ ధర్మ సమన్వయం, అద్భుత వాఖ్య ఏ దేశంలోను, ఏ కాలంలోను, ఎవ్వరు కనీ విని ఉండరు” అని బం కించంద్ అభివర్ణించారు. గీత అనే కల్పవృ క్షం సేవలో మనం ధన్యులం కావాలి. అది భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్ముచే నాటబడింది. వేదవ్యాస మహర్షిచే పెంచబడింది. ఉపనిషత్తులు దాని విత్తనం. ఆత్మ ప్రబోధం దాని అంకురం. వివిధ శాస్త్రాల రహస్యాలు దాని కొమ్మలు. వైరాగ్యం, సహనం వంటి సద్గుణాలు దాని చిగురుటాకులు. శ్రీకృష్ణుని పాదపద్మాల ఎడ మనం కనబరిచే భక్తి దానికి పుష్ప సుగంధం వంటిది. ఇది జ్ఞానులను మోక్షదాయకమైంది.
‘యోగ వాశిష్టం’లో గీతా శ్లోకాలు
ఆధ్యాత్మిక వాఙ్మయాన్ని విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చిన గొప్ప ప్రామాణిక గ్రంథాలలో ‘యోగ వాశిష్టం’ ఒకటి. ఇది అతి పురాతనమైంది. త్రేతాయుగంలో వశిష్ట మహర్షి 32,000 శ్లోకాలతో ‘యోగ వాశిష్టాన్ని’ రచించాడు. ‘భగవద్గీత’ ద్వాపర యుగంలో వ్యాసమహర్షి అందించింది. వశిష్టుడు శ్రీరామచంద్రునకు తత్త్వోపదేశం చేశాడు. శ్రీరాముడు 16 ఏండ్ల ప్రాయంలోనే దృశ్య ప్రపంచం అనిత్యత్వాన్ని తెలుసుకొని, కర్తవ్యం తెలియక తూర్ణి స్థితుడై వున్న వేళ వారి కులగురువైన వశిష్ట మునీంద్రులు ధైర్యోత్సాహాలను పురి గొలిపారు. ఇలా ‘యోగ వాశిష్టం’ అఖండ పారమార్థికతను బోధించింది. అర్జునుడు ప్రాపంచిక ఐశ్వర్యాల పట్ల విరక్తి కలిగి కర్తవ్య విముఖుడై రణరంగంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు అతనికి గీతద్వారా మానవధర్మాలను బోధించాడు. వశిష్టుని ఆత్మోపదేశంతో శ్రీరామచంద్రుడు అకర్మణత్రాన్ని పారదోలి, కర్తవ్య పాలనకు ఉపక్రమించాడు. శ్రీ కృష్ణుని దివ్యబోధనతో అర్జునుడు మోహాన్ని వదిలివేసి కార్యరంగానికి సిద్ధమయ్యాడు.
గీతా ఖ్యాతి విశ్వమంతా..
‘యోగ వాశిష్టం’ త్రేతాయుగంలోనిదైతే ‘భగవద్గీత’ ద్వాపర యుగం నాటిది. ‘యోగ వాశిష్టం’లోని నిర్వారణ ప్రకరణంలో శ్రీకృష్ణార్జునులు ఇరువురి మధ్య భావికాలంలో జరగబోయే శ్రీ భగవద్గీత రూప సంవాదమంతా సవివరాలతో సూచించబడింది. అంతేకాదు, కొన్ని గీతా శ్లోకాలైతే ఉన్నవి ఉన్నట్లు ‘యోగ వాశిష్టం’లో ఉన్నట్టివే కావడం గమనార్హం. ఇది వశిష్ట మహర్షి త్రికాలజ్ఞాన మేధోశక్తిని తెలియచేస్తున్నది. ఇంతేకాదు, ‘యోగ వాశిష్టం’ అంతటి గొప్ప గ్రంథం లో ఒక ఉపాఖ్యానమంతా గీతా సంబం ధ విషయమే ఉన్నది. దీన్నిబట్టి కూడా గీత ఎంతటి మహిమగలదో మనం అర్థం చేసుకోవచ్చు. యుగయుగాల కిందటే గీతా ఖ్యాతి విశ్వమంతా వ్యాపించినట్లు స్పష్టమవుతున్నది. గీత ప్రాచీన కాలంలో వశిష్ఠాది మహర్షుల హృదయ పీఠంలో ఆదరణ పొందిన మహాబోధ. గీత ఎంతటి సనాతనమో దీన్నిబట్టి తెలుస్తున్నది.
కలకుంట్ల జగదయ్య






