calender_icon.png 8 December, 2025 | 7:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమానంతో ప్రియురాలిని చంపిన ప్రియుడు

08-12-2025 06:27:16 PM

హైదరాబాద్: వివాహేతర సంబంధానికి తోడు అనుమానం భూతం కారణంగా ఓ నిండు ప్రాణం బలైపోయింది. నిర్మల్ జిల్లా భైంసాలో ఓ టీస్టాల్ లో వివాహిత హత్యకు గురైన సంఘటన పట్టణంలోని సంతోషిమాత ఆలయ సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా, భైంసా మండలంలోని గ్రామానికి చెందిన అశ్విని(30) అనే మహిళకు ఇదివరకే వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. భార్యాభర్తల మధ్య విభేదాలతో అశ్విని భర్తతో విడిపోయి కొన్నాళ్లుగా టీస్టాల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలోనే భైంసాలోని అంబేద్కర్ నగర్ కు చెందిన నగేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడడంతో గత ఆరు నెలలుగా ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు.

కొద్దికాలంగా అశ్విని ప్రవర్తనపై నగేష్ కు అనుమానం రావడంతో నిఘాపెట్టాడు. ఆమె మరోవ్యక్తితో సన్నిహితంగా ఉంటోందని, ఇవాళ ఉదయం మహిళ నడుపుతున్న టస్టాల్ లోనే నగేష్ కత్తితో పొడిచి చంపాడు.  టస్టాల్ వద్ద కేకలు వినిపించడంతో స్థానికులు అక్కడికి వెళ్లి చూశారు. మహిళ రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంది. నిందితుడు నగేష్ అక్కడే చెత్తిలో పట్టుకొని మృతదేహం పక్కనే కూర్చొన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.