14 April, 2026 | 4:20 AM

నేటి యువతకు స్ఫూర్తిప్రదాత బీపీ మండల్

14-04-2026 01:01 AM

బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంగెం సూర్యారావు

ఖైరతాబాద్, ఏప్రిల్ 13(విజయక్రాంతి): వెనుకబడిన తరగతుల ఆశాజ్యోతి, రిజర్వేషన్ల పితామహుడు బీపీ మండల్ నేటి యువతరానికి గొప్ప స్ఫూర్తిప్రదాత అని బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంగెం సూర్యారావు కొనియాడారు. మండల్ వర్ధంతిని పురస్కరించు కుని లక్డీకాపూల్లోని మీడియా సెంటర్లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

సమాజంలో నెలకొన్న అసమానతలను చూసి కలత చెందిన మండల్ అధికారం కేవలం కొందరి చేతుల్లోనే ఎందుకు ఉండాలనే సామాజిక స్పృహతో వెనుకబడిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేశారని గుర్తు చేశారు. బీహార్ ముఖ్యమంత్రిగా తక్కువ కాలం పనిచేసినప్పటికీ దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. బీసీ వర్గాల వారు కూడా అత్యున్నత పదవులను అధిరోహించగలరనే ఆత్మవిశ్వాసాన్ని ఆయన కల్పించారన్నారు.

కేవలం అణగారిన వర్గాల పక్షాన నిలబడటం కోసమే ముఖ్యమంత్రి పీఠాన్ని సైతం త్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని, వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తిగా ప్రధానమంత్రి అయ్యే అర్హత ఉన్నప్పటికీ నాటి రాజకీయ పరిస్థితుల వల్ల అది సాధ్యపడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేడు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో బీసీ నాయకులు బలమైన రాజకీయ శక్తులుగా ఎదుగుతున్నారంటే దానికి పునాది బీపీ మండల్ వేసిన రాజకీయ చైతన్యమేనని సూర్యారావు స్పష్టం చేశారు. విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలు రాణిస్తున్నారంటే అది మండల్ కమిషన్ నివేదిక వల్లే సాధ్యమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి మోడల శ్రీనివాస్ సాగర్, నీలి కుల సంఘ ప్రతినిధులు మానేకర్ విజయ్ కుమార్, రామకృష్ణ పాల్గొన్నారు.