తాతామనవడిగా తండ్రీ కొడుకులు.. ‘బ్రహ్మా ఆనందం’ మెప్పించిందా?
చిత్రం: బ్రహ్మా ఆనందం
నటీనటులు: బ్రహ్మానందం, రాజా గౌతమ్, ప్రియా వడ్లమాని, వెన్నెల కిషోర్, తాళ్లూరి రామేశ్వరి, రాజీవ్ కనకాల, సంపత్ రాజ్, ప్రభాకర్ తదితరులు
దర్శకత్వం: ఆర్‌వీఎస్ నిఖిల్
నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా
సంగీతం: శాండిల్య పీసపాటి
విడుదల తేదీ: 14
చాలా కాలం తర్వాత బ్రహ్మానందం(Brahma Anandam) ఫుల్ లెంగ్త్ రోల్ చేయడం.. కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న బ్రహ్మానందం ఒక కథను ఎంచుకున్నారంటే అది తప్పక అద్భుతంగా ఉంటుందన్న భావన.. తన కుమారుడితో స్క్రీన్ షేర్ చేసుకోవడం.. తండ్రీకొడుకులు తాతామనవడిగా కనిపించడం.. విజయవంతమైన చిత్రాల నిర్మాత.. వీటికి తోడు ప్రభాస్, చిరంజీవి వంటి అగ్రతారలు సినిమాకు అనుకూల ప్రచారం.. ఇంతకన్నా ఒక సినిమాకు ప్రేక్షకుడిని రప్పించేందుకు ఏం కావాలి? రప్పించారు సరే.. తమ సినిమాతో మెప్పించారా? చూద్దాం.
అసలు కథేంటంటే..
బ్రహ్మానందం(Brahma Anandam) (రాజా గౌతమ్) ఒక థియేటర్ ఆర్టిస్ట్. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో తనకు సర్వస్వం తనే అనుకుంటూ సెల్ఫిష్‌గా జీవిస్తుంటాడు. బ్రహ్మ, గిరి (వెన్నెల కిషోర్) కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. తన తాత మూర్తి వృద్ధాశ్రమంలో జీవిస్తున్నా కనీసం చూసేందుకు కూడా బ్రహ్మ వెళ్లడు. ఎప్పటికైనా పెద్ద నటుడు కావాలన్నది బ్రహ్మ లక్ష్యం. దానికి తగ్గట్టుగానే తన గురువు సాయంలో ఢిల్లీలో జరుగనున్న కళారంగ్ మహోత్సవంలో నాటకం వేసే అవకాశం వస్తుంది. అయితే దానిలో పాల్గొనాలంటే రూ.6 లక్షలు కట్టాలని వేడుక నిర్వాహకుడు కండీషన్ పెట్టడంతో అసలు కథ మొదలవుతుంది. డబ్బు కోసం బ్రహ్మ ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు కానీ ఏది ఫలించదు. అప్పుడే బ్రహ్మకు ప్రియురాలు తార (ప్రియా వడ్లమాని) సైతం బ్రేకప్ చెప్పి వెళ్లిపోతుంది. అప్పుడు బ్రహ్మ తాత మూర్తి తనకు కోదాడ దగ్గర పొలం ఉందని.. అది ఇచ్చేందుకు కొన్ని కండీషన్స్ పెట్టి ఊరికి తీసుకెళతాడు. ఆ తరువాత ఏం జరిగింది? అసలు బ్రహ్మ తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడా? ప్రియురాలితో కలిశాడా? గ్రామానికి వెళ్లిన తర్వాత కథ ఏ మలుపు తీసుకుంది? వంటి అంశాలన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
సినిమా ఎలా ఉందంటే..
తాత అనుబంధానికి అద్దం పట్టే కథ ఇది. కథ ప్రథమార్థమంతా అంటే ఇంటర్వెల్‌కు కాస్త ముందు వరకూ పాత్రల పరిచయాలతో సినిమా నడిచింది. దాదాపుగా ప్రథమార్థమంతా బ్రహ్మ చుట్టూనే తిరుగుతుంది. ఆ తరువాత బ్రహ్మకు రూ.6 లక్షలు కావాల్సి రావడంతో అసలు సినిమా ప్రారంభమవుతుంది. బ్రహ్మానందం కథలోకి పూర్తిగా ఎంట్రీ ఇవ్వడం.. అక్కడి నుంచి తాతామనవడి మధ్య సన్నివేశాలు ప్రారంభమవుతాయి. ఊరికి బ్రహ్మ, మూర్తి, గిరి కలిసి వెళ్లడం.. అక్కడ గిరి బామ్మ ఇల్లు అనుకుని రాజీవ్ కనకాల ఇంటికి వెళ్లడం అంతా సరదాగా సాగిపోతుంది. ఊరెళ్లాక మూర్తి తన మనవడిని అసలు ఆ ఊరుకు ఎందుకు తీసుకొచ్చాడనే విషయం చెబుతాడు. ఇదే సినిమాలో పెద్ద ట్విస్ట్. ఆద్యంతం సినిమా ఆకట్టుకుంటుంది. వెన్నెల కిషోర్ తనదైన శైలిలో వినోదం పంచాడు. బ్రహ్మ పాత్రల మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయి. ఈ ముగ్గురూ పోటీపడి మరీ నటించారు. రాజా గౌతమ్ కూడా తన నటనను చాలా మెరుగుపరుచుకున్నాడు. సినిమాకు ద్వితీయార్థం ప్రాణం పోసింది.
ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకుని ఉంటే..
సినిమాకు సంబంధించి కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకుని ఉంటే సినిమా ఇంకా బాగుండేది. ఊరుకు తీసుకెళ్లిన లక్ష్యాన్ని పక్కనబెట్టి బ్రహ్మను టెన్త్ క్లాస్ టీచర్‌గా మార్చడం సినిమాకు అంతగా కలిసి రాలేదు. ఇది మినహా సినిమా అంతా కుటుంబంతో కలిసి చక్కగా చూడవచ్చు.






