17 May, 2026 | 8:48 AM

విశ్వక్‌సేన్ ‘లైలా’ మెప్పించిందా?

14-02-2025 07:24 PM

చిత్రం: లైలా

తారాగణం: విశ్వక్‌సేన్, ఆకాంక్ష శర్మ, అభిమన్యు సింగ్, పృథ్వీరాజ్, పృథ్వీ తదితరులు

దర్శకుడు: రామ్ నారాయణ్

నిర్మాత: సాహు గారపాటి

సంగీతం: లియోన్ జేమ్స్

విడుదల: 14, ఫిబ్రవరి 2025

విశ్వక్‌సేన్ లేడీ గెటప్(Vishwak Sen Lady Getup) అని టాక్ రావడం.. దానికి సంబంధించిన పోస్టర్స్ కూడా ముందే బయటకు రావడం.. ఆ పోస్టర్స్‌లో విశ్వక్ లుక్ ఆకట్టుకోవడంతో సినిమాపై ప్రేక్షకుల్లో సాధారణంగానే ఆసక్తి పెరిగింది. చాలా కాలం తర్వాత లేడీ గెటప్ కాన్సెప్ట్‌తో సినిమా వస్తుండటంతో అంచనాలు సైతం ఆ విధంగానే పెరిగాయి. ప్రేమికుల రోజు(Valentine's Day) సందర్భంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా? చూద్దాం. 

కథేంటంటే..

సోను (విశ్వక్‌సేన్) ఓల్డ్ సిటీలో తన తల్లి నేర్పించిన విద్యను బతుకుదెరువుగా మార్చుకుని బ్యూటీ పార్లర్ నడుపుతుంటాడు. తల్లి జ్ఞాపకంగా నిర్వహిస్తున్న పార్లర్ అంటే అతనికి చాలా ఇష్టం. అతను మేకప్ చేసే విధానానికి మహిళలు ఫిదా అయిపోతుంటారు. ఈ క్రమంలోనే సోను బ్యూటీ పార్లర్‌కి మహిళలు క్యూ కడుతుంటారు. సోను కూడా తన వద్దకు కష్టం అని వచ్చిన వారికి అండగా నిలుస్తుంటాడు. అనుకోకుండా సోను మూడు సమస్యల్లో ఇరుక్కుంటాడు. వాటి నుంచి ఏదో తప్పు చేసిన వాడిలా పారిపోకూడదనుకుంటాడు. అక్కడే ఉంటూ తను ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాలని ‘లైలా’గా మారతాడు. ఆ తరువాత ఆమె లైలా కాదని.. సోను అని విలన్స్‌కి తెలిసిపోతుంది. అసలు సోనుకి వచ్చిన సమస్యలేంటి? వాటి నుంచి అతను ఎలా గట్టెక్కాడు. లైలా కాదని తెలుసుకున్న విలన్స్ బారి నుంచి ఎలా తప్పించుకున్నాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 

సినిమా మొత్తంగా ఎలా ఉంది?

ఎలాంటి అంచనాలు లేకుండా సినిమాకు వెళితే ఎంజాయ్ చేసి రావొచ్చు. లైలా పాత్రలో విశ్వక్‌సేన్ నటన అద్భుతం. ఆయన హావభావాలు ఆకట్టుకున్నాయి. విలన్ కుటుంబం చిరంజీవిని ఇష్టపడటం. కుటుంబ సభ్యులకు చిరు సినిమాల పేర్లు పెట్టడం.. వారు కనిపించినప్పుడల్లా వచ్చే చిరు హిట్ సాంగ్స్ ప్రేక్షకులకు మంచి ఎంజాయ్‌మెంట్. సినిమా కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. లైలా, సోను పాత్రలు కూడా చాలా ఆకట్టుకుంటాయి. ఈ పాత్రలో విశ్వక్ జీవించాడు. లైలా గెటప్‌లో విశ్వక్‌సేన్ పంచిన వినోదాన్ని చూసి తరించాల్సిందే. ఆద్యంతం నవ్వులు పూయించాడు. ఈ సినిమాలో సునిశిత్ పాత్ర కూడా చాలా కీలకం. సాంకేతికంగానూ.. మ్యూజిక్ పరంగానూ సినిమా బాగానే ఉంది.

ఈ జాగ్రత్తలు తీసుకుని ఉంటే..

సినిమాకు సంబంధించి కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకుని ఉంటే సినిమా వేరే లెవల్లో ఉండేది. హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఇచ్చి ఉంటే బాగుండేది. అలాగే తల్లి సెంటిమెంట్‌కు మరికాస్త మెరుగుబెట్టి ఉంటే సినిమాకు చాలా ప్లస్ అయి ఉండేది. సోనూను చుట్టుముట్టిన సమస్యల తీవ్రత కాస్త పెంచి ఉండాల్సింది. అప్పుడు లైలాగా సోను మారడానికి కారణం మరింత స్ట్రాంగ్‌గా కనిపించేది. హీరోయిన్ గ్లామర్‌గా కనిపించింది కానీ ఆమె పాత్రను కథలో మరింత ఇన్వాల్వ్ చేసి ఉండాల్సింది. మొత్తంగా రచన, స్క్రీన్‌ప్లే మరింత బలంగా ఉండి ఉంటే సినిమా రేంజ్ మారిపోయి ఉండేది.