అధికారుల లంచావతారాలు
- అవినీతి నిరోధక శాఖ దూకుడు
- గడిచిన 8 నెలల్లో 179 కేసులు, 167 మంది అరెస్ట్
- రూ.44.30 కోట్ల అక్రమాస్తులు స్వాధీనం
- అవినీతిలో రెవెన్యూ శాఖ టాప్
- రెండు, మూడు స్థానాల్లో పోలీస్, మున్సిపల్ శాఖలు
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): తెలంగాణలో అవినీతి అధికారుల గుండెల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) రైళ్లు పరుగెట్టిస్తోంది. కొత్త ప్రభుత్వం నుంచి పూర్తి స్వేచ్ఛ లభించడంతో లంచావతారాలపై సింహస్వప్నంలా విరుచుకుపడు తోంది. గడిచిన ఎనిమిది నెలల కాలంలోనే రికార్డు స్థాయిలో 179 కేసులు నమోదు చేసి, 167 మంది ప్రభుత్వ ఉద్యోగులను కటకటాల వెనక్కి నెట్టింది. వీరి నుంచి సుమారు రూ.44.30 కోట్ల విలువైన అక్రమాస్తులను స్వాధీనం చేసుకుని అవినీతిపరులకు తీవ్ర హెచ్చరికలు పంపింది.
రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏసీబీకి పూర్తి స్వేచ్ఛనిచ్చింది. అవినీతి అధికారి ఏ శాఖలో ఉన్నా, ఏ హోదాలో ఉన్నా ఉపేక్షించవద్దని, ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏసీబీ అధికారులు టోల్-ఫ్రీ నంబర్, వాట్సాప్ నంబర్లను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు. బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో, పక్కా సమాచారంతో దాడులు చేస్తూ లంచగొండులకు చెక్ పెడుతున్నారు. ఒక్క ఆగస్టు నెలలోనే 31 కేసులు నమోదు చేసి, 22 మంది ప్రభుత్వ ఉద్యోగులతో పాటు నలుగురు ప్రైవేటు వ్యక్తులను అరెస్టు చేయడం ఏసీబీ దూకుడుకు నిదర్శనం.
అవినీతికి అడ్డాగా రెవెన్యూ శాఖ!
ఏసీబీ నమోదు చేసిన కేసుల ఆధారంగా చూస్తే రాష్ర్టంలో అవినీతికి అడ్డాగా రెవెన్యూ శాఖ మొదటి స్థానంలో నిలిచింది. భూ సంబంధిత వ్యవహారాల్లో ఎక్కువగా లంచా లు తీసుకుంటూ ఈ శాఖ అధికారులు పట్టుబడుతున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో పోలీస్, మున్సిపల్ శాఖలు ఉన్నాయి. ఈ ఎనిమిది నెలల్లో పట్టుబడిన వారిలో 20 మందికి పైగా మహిళా అధికారులతో పాటు, పలువురు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఉండటం గమనారం. ప్రతి నెలా సగటున 20 మంది అవినీతి అధికారులు ఏసీబీ వలకు చిక్కుతున్నారు.
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ఉన్నతాధికారుల ఇళ్లపై ఇటీవల ఏసీబీ ఏకకాలంలో దాడులు చేసి, వందల కోట్ల విలువైన ఆస్తులను గుర్తించి సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఏసీబీ ఇదే దూకుడు కొనసాగిస్తే అవినీతికి అడ్డుకట్ట పడుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.






