ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న వైయస్సార్
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కరీంనగర్, సెప్టెంబరు 2 (విజయ క్రాంతి): ప్రజల గుండెల్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ చెరగని ముద్ర వేసుకున్నారని సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం వైయస్సార్ వర్ధంతి సందర్భంగా డిసిసి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే, ఆరెపల్లి మోహన్, డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డితో కలిసి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చేసిన సేవలలో భాగంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, మిడ్ మానేరు ప్రాజెక్టు, వరద కాలువ, కొండగట్టు జేఎన్టీయూ, మంథని జేఎన్టీయూ, శాతవాహన యూనివర్సిటీ, పాలిటెక్నిక్ కాలేజ్ లను స్థాపించారని అన్నారు. అన్ని రంగాలలో ఈ జిల్లాను అభివృద్ధి చేసి ప్రజలలో చెరగని ముద్ర వేసుకున్నారని తెలిపారు.
ఆనాడు రైతుల ఆత్మహత్యలను గుర్తించి ఒక్క సంతకంతో రైతు రుణ మాఫీ చేయడం, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఫీజు రియంబర్స్మెంట్, పేద ప్రజలకోసం ఆరోగ్య శ్రీ, 108 అంబులెన్స్ సేవలు, ఇందిరమ్మ ఇండ్లు, ప్రవేశపెట్టిన పథకాలతో పాటు నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో మరెన్నో ప్రజాప్రయోజన సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వైయస్‌ఆర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకు వెళుతూ కాంగ్రెస్ పార్టీని ప్రజలకు మరింత చేరువయ్యేలా సేవ చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలుపాల్గొన్నారు.






