రాణే ఇంజిన్ వాల్వ్ కంపెనీలో బ్రిక్స్ కార్మిక సంఘాల సదస్సు
మొయినాబాద్, జులై 16(విజయ క్రాంతి): మొయినాబాద్ మండలం అజీజ్నగర్ పరిధిలోని రాణే ఇంజిన్ వాల్వ్ లిమిటెడ్ కంపెనీలో బ్రిక్స్ దేశాల కార్మిక సంఘాల అంతర్జాతీయ సదస్సు ఘనంగా జరిగింది. ఈ సదస్సుకు 14 దేశాల నుండి సుమారు 45 మంది విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. కార్మికుల సామాజిక, ఆర్థిక, ఉద్యోగ భద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.ప్రతి సంస్థలో కార్మికులందరికీ ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం కల్పించాలని, వారి రక్షణకు పెద్దపీట వేయాలని స్పష్టం చేశారు.
మానవ శ్రమతో చేయలేని కఠినమైన పనులకు మాత్రమే కృత్రిమ మేధ (ఎఐ ) సాంకేతికతను పరిమితం చేయాలని ఈ సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో బీఎంఎస్ జాతీయ అధ్యక్షుడు ఎస్. మల్లేశం, ఆల్ ఇండియా సంఘటన్ మంత్రి పి. సురేంద్రన్, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. రాంరెడ్డి, ఇతర ప్రతినిధులు, కంపెనీ ప్రతినిధులు రెడ్డి కుమార్, హెచ్‌ఆర్ మహేశ్వరరావు మరియు కార్మికులు పాల్గొన్నారు.






